Harish Rao: పోలీస్ శాఖలో మరణ మృదంగం.. ఈ ప్రభుత్వానికి పట్టదా?
ABN , Publish Date - Dec 29 , 2024 | 03:49 PM
BRS Leader Harish Rao: తెలంగాణలోని పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు వరుసగా ఆత్మహత్యలు చోటు చేసుకోంటున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలో చోటు చోటు చేసుకొంటున్న వరుస పరిణామాలపై సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది. అలాంటి వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆదివారం.. తన ఎక్స్ వేదికగా స్పందించారు. ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై , కానిస్టేబుల్, ఈ రోజు సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్... వీరంతా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే.. ఇలా వరుసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతలు పరిరక్షించవలసిన రక్షకుల జీవితాలకే రక్షణ కరువైందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. పని ఒత్తిడి, పెండింగ్ హామీల తీర్చడంలో ప్రభుత్వ అవలంభించిన నిర్లక్ష్య వైఖరి.. పోలీసులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నదన్నారు. ఈ ఆత్మహత్యలపై నిజానిజాలు వెలుగులోకి రావడానికి శాఖాపరమైన దర్యాప్తు చేయాలని తెలంగాణ డీజీపీని ఆయన కోరారు. అలాగే పోలీసుల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రాకుండా వారికి సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి మాజీ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.
అలాగే పోలీస్ మిత్రులకు సైతం ఆయన కీలక సూచన చేశారు. సమస్యలు ఏవైనప్పటికీ ఆత్మహత్యలు పరిష్కారం కాదని వారు స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి ఈ ఉద్యోగాలు సాధించారని వారికి గుర్తు చేశారు. మీ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండంటూ వారికి సూచించారు. విలువైన జీవితాలను కోల్పోకండంటూ వారికి హితవు పలికారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మీరు ఆత్మస్థైర్యంతో విధులు నిర్వహిస్తేనే సమాజానికి భద్రత ఉంటుందని ఈ సందర్భంగా పోలీసులకు మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు.
ఇటీవల ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్.. ఓ రిసార్ట్‌లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే సిద్దిపేటలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పండరి బాలకృష్ణ.. తన భార్య, పిల్లలకు విషమిచ్చి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ మరణించగా.. అతడి భార్య, పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కామారెడ్డి జిల్లాలో ఓ ఎస్సై , మహిళా కానిస్టేబుల్ మరణం సంచలనంగా మారింది. వీరితో మరో వ్యక్తి నిఖిల్ సైతం మరణించాడు. దీంతో ఈ కేసు ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమైయున్నారు. ఇక ఈ రోజు.. అంటే అదివారం మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ క్వార్టర్స్ ఆవరణలో హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సాయి కుమార్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు పోలీసు శాఖలో ఆత్మహత్యలపై ఆదివారం హైదరాబాద్‌లో డీజీపీ జితేందర్ స్పందించారు. ఈ ఏడాది కాదు.. ప్రతి ఏడాది ఏదో ఒక కారణంతో పోలీస్ శాఖలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వివరించారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు, వ్యక్తిగత కారణాలు, కుటుంబ సమస్యలతో వారు ఆత్మహత్య చేసుకొంటున్నారని తెలిపారు. అయితే కొన్ని కేసులో పని ఒత్తిడి కారణంగా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని స్పష్టం చేశారు.
పోలీసులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని డీజీపీ జితేందర్ వివరణ ఇచ్చారు. ఇంకోవైపు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఇలా వరుసగా పోలీసులు మరణిస్తుండడంపై ప్రజల్లో సైతం తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. అలాంటి వేళ పోలీసుల్లో మనో ధైర్యం నింపేందుకు చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తన ఎక్స్ ఖాతా వేదికగా పైవిధంగా స్పందించారు.
For Telangana News And Telugu News