Share News

TG News: తెలంగాణేతరులకు రాజ్యసభ సీటు కేటాయించడంపై బీఆర్ఎస్ ఫైర్..

ABN , Publish Date - Aug 15 , 2024 | 06:44 PM

మాజీ బీఆర్ఎస్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావు(కేకే) రాజీనామా చేసిన రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ నాయకుడు అభిషేక్‌ మను సింఘ్వి పేరు ప్రకటించడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణేతర వ్యక్తికి ఎంపీ సీటు కేటాయించడంపై కాంగ్రెస్ అధిష్ఠానంపై బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరుగుతున్నారు.

TG News: తెలంగాణేతరులకు రాజ్యసభ సీటు కేటాయించడంపై బీఆర్ఎస్ ఫైర్..

హైదరాబాద్: మాజీ బీఆర్ఎస్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావు(కేకే) రాజీనామా చేసిన రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ నాయకుడు అభిషేక్‌ మను సింఘ్వి పేరు ప్రకటించడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణేతర వ్యక్తికి ఎంపీ సీటు కేటాయించడంపై కాంగ్రెస్ అధిష్ఠానంపై బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణకు చెందిన నేతలు అధిష్ఠానానికి కనిపించడం లేదా అంటూ ధ్వజమెత్తున్నారు.


తెలంగాణ నేతలు కనిపించడం లేదా?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. అధిష్ఠానం పెద్దలు తెలంగాణ కాంగ్రెస్ నేతలను కీలుబొమ్మల్లా ఆడిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా చేస్తే ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబెట్టేందుకు వీహెచ్ సహా బీసీ, ఎస్సీ, మైనార్టీ నాయకులు వారికి కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో అభిషేక్ సింఘ్వి ఏ రోజూ సానుకూలంగా స్పందించలేదని, అలాంటి వారికి ఎలా సీటు కేటాయిస్తారని వద్దిరాజు ధ్వజమెత్తారు.


రాష్ట్రంలో అర్హులు లేనట్లు ఢిల్లీ నేతకు రాజ్యసభ సీటు ఇవ్వడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని అన్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభించడం సంతోషమని, అయితే మంత్రులు చెప్పినట్లుగా ఏడెనిమిది నెలల్లో దాన్ని పూర్తి చేయడం సాధ్యం కాదన్నారు. ప్రాజెక్టులకు కాంగ్రెస్ నేతలు స్విచ్ ఆన్ చేయడం హర్షించదగ్గ విషయమని, అయితే అదే పనిగా గత పాలకులను అవమానపరచడం సరికాదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.


కేసీఆర్ వల్లే రేవంత్ రెడ్డి సీఎం..!

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తేవడం వల్లే రేవంత్ రెడ్డి సీఎం, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎంగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల వారికి రాజ్యసభ సీటు కేటాయించాలంటూ కేసీఆర్‌పై పెద్దస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయని, అయినా ఆయన లెక్క చేయకుండా రాష్ట్ర నేతలకే ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ వ్యతిరేకులకు కాంగ్రెస్ పదవులు ఇవ్వడం చాలా బాధ కలిగిస్తోందని మాజీ మంత్రి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ పదవులు అన్నీ తెలంగాణేతరులకే ఇచ్చారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీ నేతలకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నేతలు లేదా తెలంగాణకు అనుకూలంగా ఉన్న వారికే సీట్లు కేటాయించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హితవుపలికారు.

ఈ వార్తలు కూడా చదవండి:

సీతారామ ప్రాజెక్టును 2026కల్లా పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్

Minister Tummala: పది వేల కోట్లు ఖర్చయినా మాట నిలబెట్టుకుంటాం..

Updated Date - Aug 15 , 2024 | 06:45 PM