CM Revanth Reddy: బీఆర్ఎస్ చేసిన కుట్రతోనే కాంగ్రెస్ 8 చోట్ల ఓడిపోయింది: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Jun 05 , 2024 | 01:58 PM
హైదరాబాద్: వంద రోజుల కాంగ్రెస్ పాలనకు ప్రజలు పట్టం కట్టారని, మమ్మల్ని ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బుధవారం ఆయన నివాసం వద్ద ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్ల శాతం పెరిగిందన్నారు.
హైదరాబాద్: వంద రోజుల కాంగ్రెస్ (Congress) పాలనకు ప్రజలు పట్టం కట్టారని, మమ్మల్ని ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు (Telangana people) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ధన్యవాదాలు తెలిపారు. బుధవారం ఆయన నివాసం వద్ద ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ (Assembly) ఎన్నికల కంటే పార్లమెంట్ (Parliament) ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్ల శాతం పెరిగిందని, తమ రెఫరెండంకు ప్రజలు మద్దతు తెలిపారన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం పోరాడిన కార్యకర్తలకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కార్యకర్తలు తమ గౌరవాన్ని నిలబెట్టారన్నారు.
బీజేపీ (BJP) కోసం బీఆర్ఎస్ (BRS) నాయకులు అవయవదానం చేసారని, బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు ఎంతో కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందన్నారు. 7 నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయిందని, పార్టీ పెట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి సిద్దిపేటలో మెజారిటీ వచ్చిందని, సిద్దిపేటలో హరీష్ రావుకు పూర్తి పట్టున్నప్పటికీ తమ ఓట్లు బీజేపీకి వేయించారని, బీఆర్ఎస్ చేసిన కుట్రతోనే కాంగ్రెస్ 8 చోట్ల ఓడిపోడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మోదీ (PM Modi) గ్యారంటీకి ఉన్న వారంటీ అయిపోయిందని, ఆయన కాలం చెల్లిపోయిందని, మోదీ చరిష్మాతో ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు తిరస్కరించిన మోదీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు విలువలు ఉంటే ప్రధాని పదవి నుండి హుందాగా తప్పుకోవాలన్నారు. ఈరోజు నుంచి మరో రెండు గంటలు అదనంగా పని చేస్తామని, రాష్ట్రంలో ఏ సీటు గెలిచినా, ఏ సీటు ఓడినా తనదే బాధ్యత అని రేవంత్ రెడ్డి అన్నారు. గెలుపు ఓటములు తానే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. తమకు వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడి లాగా ఉన్నాయని, వాటిని స్వీకరిస్తున్నానని అన్నారు. కేసీఆర్ బీజేపీతో బేరసారాలు చేసుకుంటున్నారని, ఆత్మ ప్రబోధానుసారం బీఆర్ఎస్ నాయకులు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కేసీఆర్ రాజకీయ జూదగాడని, ఆయన రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉంటారని విమర్శించారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడు కేసీఆర్ అని ఆయనతో బీజేపీ స్నేహం ఎలా చేస్తోందని ప్రశ్నించారు. ఏపీలో ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటామని, ఏపీతో ఉన్న ఆస్తులు, నీటి పంపకాలను చర్చించి పరిష్కరించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కాగా అంచనా వేసుకున్న దాని కంటే ఒక సీటు తగ్గినా.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌కు భారీ ఊరటనే ఇచ్చాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లలో మెజారిటీ స్థానాలు దక్కక పోయినా, బీజేపీకి సమాన స్థాయిలో సీట్లు దక్కించుకుని గౌరవప్రద స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో 9 నుంచి 12 సీట్లు గెలుచుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెల్లడించారు. అయితే ఆ అంచనాలకు ఒకటి తక్కువగా 8 సీట్లను కాంగ్రెస్ దక్కించుకుంది. వీటిలో నల్లగొండ, ఖమ్మం, భువనగిరి, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్ సీట్లలో అభ్యర్థులు లక్షకుపైగా మెజారిటీ సాధించారు. నాగర్‌కర్నూల్‌లో 90వేల పైచిలుకు, జహీరాబాద్‌లో 50వేల పైచిలుకు మెజారిటీ లభించింది. మహబూబ్‌నగర్ సీటును స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయింది. మెదక్, సికింద్రాబాద్‌లోనూ 50వేల లోపు ఓట్ల తేడాతోనే ఓటమిపాలైంది. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికలు రేవంత్ ప్రభుత్వానికి పరీక్షగా మారాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి అంతా తానై రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేశారు. మంత్రులూ తమకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాల్లో శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓట్లు తాము అంచనా వేసిన దానికంటే ఎక్కువగా బీజేపీకి బదిలీ అయ్యాయని, దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లకు పరిమితమైన బీజేపీ.. లోక్‌సభకు వచ్చే సరికి ఏకంగా 8 సీట్లు దక్కించుకోగలిగిందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.