TS Politics: సోనియాతో సీఎం రేవంత్ భేటీ.. 20 నిమిషాల పాటు చర్చించిన విషయాలివే..?
ABN , Publish Date - Feb 05 , 2024 | 09:56 PM
ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi)తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
ఢిల్లీ: ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi)తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. దాదాపు 20 నిమిషాలపాటు సోనియా, రేవంత్‌రెడ్డి పలు విషయాలపై చర్చించారు. ఈ భేటీకి సంబంధించిన విషయాలను మీడియాకు భట్టి విక్రమార్క వివరించారు. సుమారు అరగంట పాటు సోనియా గాంధీతో భేటీ అయినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి మర్యాదపూర్వకంగా పార్టీ అగ్రనేతను కలిసినట్లు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచే పోటీ చేయాలని సోనియాను కోరినట్లు తెలిపారు.
ఇప్పటికే తెలంగాణ నుంచి తీర్మానం చేసి పంపినట్లు ఆమె దృష్టికి తీసుకెళ్లామన్నారు. తెలంగాణలో అమలు చేసిన, చేయబోతున్న గ్యారెంటీలను వివరించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకంలో గడిచిన రెండు నెలల్లో రూ.15కోట్ల జీరో టికెట్లు రికార్డు అయ్యాయని సోనియా గాంధీకి తెలిపామన్నారు. త్వరలోనే మరో రెండు గ్యారెంటీలు అమలు చేయబోతున్నట్లు వివరించామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500 కే గృహ అవసరాలకు గ్యాస్ సిలిండర్ అమలు చేయనున్నట్లు చెప్పామన్నారు. తెలంగాణలో మొదటిసారి హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందిస్తున్నట్లు సోనియా గాంధీకి వివరించామన్నారు. పథకాల అమలుపై సోనియా గాంధీ అభినందించారని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.