Congress: కేసీఆర్ అసెంబ్లీకు ఎందుకు రావట్లేదు: రామ్ మోహన్ రెడ్డి
ABN , Publish Date - Feb 12 , 2024 | 05:49 PM
ఈరోజు (సోమవారం) అధికార, ప్రతిపక్షాల మధ్య కృష్ణా జలాల నీటి వాటాపై చర్చ జరిగింది. ఈ చర్చలో గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం చేసిన తప్పిదాలపై సభలో అధికార ఎమ్మెల్యేలు గులాబీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.
హైదరాబాద్: ఈరోజు (సోమవారం) అధికార, ప్రతిపక్షాల మధ్య కృష్ణా జలాల నీటి వాటాపై చర్చ జరిగింది. ఈ చర్చలో గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం చేసిన తప్పిదాలపై సభలో అధికార ఎమ్మెల్యేలు గులాబీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. కేంద్రానికి గత ప్రభుత్వమే నీటి వాటాను అప్పగించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిలదీశారు. ఇదిలా ఉంటే అసలు కేసీఆర్ అసెంబ్లీకు ఎందుకు రావడం లేదని.. తెలంగాణ ప్రజలపై ఆయనకు ఉన్న అభిమానం ఇదేనా అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. అసెంబ్లీలో జరిగిన వాదోపవాదనలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీడియాకు వివరాలను వెల్లడించారు.
కేసీఆర్ ఏ హామీని నిలబెట్టుకోలేదు: రామ్ మోహన్ రెడ్డి
కేఆర్ఎంబీకి ఎలాంటి ప్రాజెక్టులు అప్పగించబోమని తీర్మానం చేసిందందుకు ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికీ రంగారెడ్డి జిల్లాలో కాల్వల పనులు కూడా ప్రారంభం కాలేదన్నారు. వికారాబాద్ జిల్లాకు కృష్ణ నీళ్లు ఇస్తానని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని..కానీ ఆ హామీని నిలబెట్టుకోలేదన్నారు. తాము కృష్ణా నదికి చివరి అంచున ఉండటంతో నీళ్లు రావొచ్చు..రాకపోవచ్చని తెలిపారు. పరిగికి లక్ష ఎకరాలకు ఇస్తా అన్న కేసీఆర్..ఎందుకు ఈరోజు అసెంబ్లీకు హాజరు కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్‌ది తుగ్లక్ పాలన: ఎమ్మెల్యే మదన్ మోహన్
కేసీఆర్ నల్లగొండలో సభకు పిలుపు ఇవ్వడం సిగ్గు చేటని డోర్నకల్ ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. కేసీఆర్‌ది తుగ్లక్ పాలన అని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో గొప్ప ప్రాజెక్ట్ కాళేశ్వరం అని చెప్పి.. ఇప్పుడు అది కూలిపోయే పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. ఏ ఇంజనీర్ చెప్పినా వినకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టించారని మండిపడ్డారు. కేసీఆర్.. నిజమైన తెలంగాణ వాది కాదన్నారు. నల్లగొండలో సభ పెట్టే హక్కు తనకు లేదని మదన్ మోహన్ అన్నారు.
కేసీఆర్ కేంద్రానికి కృష్ణా జలాలను అప్పగించారు: ఎమ్మెల్యే రామచంద్ర నాయక్
కేసీఆర్ రాజకీయ స్వార్థం కోసం కృష్ణా జలాలను కేంద్రానికి అప్పగించారని ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్నారు. చట్ట సభలకు రాని కేసీఆర్..నల్లగొండ సభకు మాత్రం ఎలా వెళ్తారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చామని కేసీఆర్ అన్నారని.. అసెంబ్లీకి వచ్చి నీటిని ఎక్కడ ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గుణపాఠం తప్పదని ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
మేడిగడ్డ బ్యారేజ్‌ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈనెల 13వ తేదీన ఉదయం 10 గంటలకు సందర్శిస్తామని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. 3 గంటల నుంచి 5 గంటల పాటు బ్యారేజ్ ప్రాంతంలో పర్యటిస్తామని చెప్పారు. అన్ని పార్టీల నేతలు తమతో కలిసి రావాలని తెలిపారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వెళ్తామని అన్నారు. అధికారుల సమక్షంలో ప్రాజెక్ట్‌ను సందర్శిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో రూ. 97 వేల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు.
నల్గొండకు కేసీఆర్ ఎందుకెళ్తున్నారు: మల్‌రెడ్డి రంగారెడ్డి
గతంలో తెలంగాణ గురించి మాట్లాడిన మాజీ సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం లేదని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ పక్షాన వచ్చామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంచి ఉంటే మంచి..చెడు ఉంటే చెడు అని ఎందుకు చెప్పలేదని నిలదీశారు.కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనికిమాలిన పని చూపించడానికి తాము వెళ్తుంటే..ఆయన నల్లగొండకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. తప్పు నువ్వు చేసి మీ పార్టీ సభ్యులతో సభలో మాట్లాడిస్తారని మండిపడ్డారు. సభలో నీళ్ల గురించి అడుగుతుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నీళ్లు నములుతున్నారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి..ఏం చేయకుండా మొహం చాటేశారని మండిపడ్డారు. తెలంగాణ సొమ్మును దోచుకొని నల్లగొండకు పోయి ప్రజలకు ఏం చెప్పడానికి వెళ్తున్నారని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రశ్నించారు.