Narayana: కాళేశ్వరంపై బీజేపీ సీబీఐ విచారణ అడగడం పెద్ద జోక్
ABN , Publish Date - Feb 17 , 2024 | 01:24 PM
Telangana: కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ సీబీఐ విచారణ అడగడం ఒక పెద్ద జోక్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే వ్యవహార శైలిలో నడుస్తున్నాయని ప్రజలకు తెలుసన్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ (BJP) సీబీఐ విచారణ అడగడం ఒక పెద్ద జోక్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Leader Narayana) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే వ్యవహార శైలిలో నడుస్తున్నాయని ప్రజలకు తెలుసన్నారు. బీఆర్ఎస్, బీజేపీకి మధ్య సయోధ్య ఉందని.. అందుకే ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) బయట ఉందన్నారు. కవితను రెండేళ్ల నుంచి ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారని ప్రశ్నించారు. కేసీఆర్ (BRS Chief KCR) పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరంపై ఎందుకు సీబీఐ దర్యాప్తు వేయలేకపోయారని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిని సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్ సేఫ్ అవుతారన్నారు. కుట్రపూరితంగా కేసీఆర్‌ను కాపాడటానికి బీజేపీ కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతోందని విమర్శించారు. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్ సేఫ్‌గా ఉంటారని బీజేపీ నేతలు ఆలోచన చేస్తున్నారన్నారు. కేసీఆర్ జుట్టును వారి చేతిలో పెట్టుకోవాలని బీజేపీ చూస్తోందన్నారు. కేసీఆర్‌ను కాపాడే కుటిల బుద్ధి బీజేపీ నేతల్లో కనిపిస్తోందని నారాయణ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీకి అనుకూలంగా ఉంటేనే...
రూ.100 కోట్ల లిక్కర్ స్కాం వైసీపీ, కవిత నుంచి వచ్చిందని ఆరోపించారు. రూ.100 కోట్ల లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం అరెస్ట్ చేశారన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాలని చూస్తున్నారన్నారు. 11 కేసులు, వేల కోట్ల అవినీతి చేసిన జగన్ బయట ఉంటున్నారని మండిపడ్డారు. జగన్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి అనుకూలంగా ఉన్నవారు బయట ఉంటారని.. వ్యతిరేకించేవారికి దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇస్తాయన్నారు. కోడి కత్తి కేసులో ఐదేళ్లు నిందితుడు శ్రీను జైల్లో ఉన్నాడన్నారు. బీజేపీ జాతీయ సమావేశాల్లో ఏం చర్చిస్తారని నిలదీశారు. 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు?.. ఎన్ని ప్రాజెక్టులు కట్టారు?.. రైతులకు ఏం చేశారు?.. ప్రజల ఇబ్బందులపై చర్చిస్తారా? అంటూ ప్రశ్నలు కురిపించారు. ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోతల ఉంది మోడీ ప్రభుత్వ పరిస్థితి అంటూ వ్యాఖ్యలు చేశారు. మోడీ అధికారంలోకి వస్తే సెక్యులర్ వ్యవస్థ ఉండదని నారాయణ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...