TG News: వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌తో.. అసంపూర్తిగా ముగిసిన జూడాల చర్చలు
ABN , Publish Date - Jun 24 , 2024 | 04:54 PM
మంత్రి దామోదర రాజనర్సింహతో (Damodara Raja Narasimha) జూనియర్ డాక్టర్లు నేడు(మంగళవారం) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జూడాలు పలు డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
హైదరాబాద్: తమ డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు (Junior Doctors) సమ్మె చేస్తున్నారు. నేడు(మంగళవారం) వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో (Damodara Raja Narasimha) జూడాలు చర్చలు జరిపారు. ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయని తెలిపారు. జూడాలు పలు డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. మరికొన్ని అంశాలపై మరోమారు చర్చించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆయా అంశాలపై ప్రపోజల్స్ ఉన్నతాధికారులకు పంపించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతానికి సమ్మె యధాతథంగా కొనసాగిస్తామని, చర్చలు అసంపూర్తిగా ముగిశాయని జూడాలు తెలిపారు.
వైద్యుల భద్రత గురించి మంత్రి ఆలోచిస్తామన్నారని, స్టైఫండ్‌కు గ్రీన్‌ఛానల్‌పై మరోకసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సమ్మె కొనసాగింపుపై రాష్ట్రస్థాయి జూడాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు సమ్మె యథాతథంగా కొనసాగిస్తామని జూడాలు వెల్లడించారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతినెలా స్టైఫండ్ చెల్లింపు, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్‌లకు రూ.1.25 లక్షల గౌరవ వేతనం, వైద్యకళాశాలల్లో పెంచిన 15 శాతం సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకూడదని, వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలనే పలు డిమాండ్లతో జూడాలు సమ్మె బాట పట్టారు.