TS Politics: సీఎం రేవంత్‌పై తగ్గేదేలే అంటున్న హరీష్ రావు..!
ABN , Publish Date - Feb 05 , 2024 | 04:09 PM
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంస్కారం లేని భాష మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... సీఎం ఇలా మాట్లాడతారా..? అని ప్రజలు అసహ్యించుకున్నారని.. సీఎం భాష విలువలు పెంచేదిగా ఉండాలని హితవుపలికారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంస్కారం లేని భాష మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు (Former Minister Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు హరీష్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం ఇలా మాట్లాడతారా..? అని ప్రజలు అసహ్యించుకున్నారని.. సీఎం భాష విలువలు పెంచేదిగా ఉండాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌పై (BRS Chief KCR) నీచమైన భాష వాడారన్నారు. ప్రాజెక్టులు అప్పచెప్పామని రంకెలు వేస్తున్నారని మండిపడ్డారు. కేఆర్‌ఎంబీ (KRMB) మీటింగ్‌లో ప్రాజెక్టులు అప్పగించడానికి అంగీకరించారని.. అందుకే వివాదం మొదలైందన్నారు.
శాంపిల్ మాత్రమే..
జనవరి 17న ఢిల్లీలో జరిగిన మీటింగ్‌లో ప్రాజెక్టుల అప్పగింతకు ఆమోదం తెలిపారన్నారు. మినిట్స్‌లో అది స్పష్టంగా ఉందని.. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేదని విమర్శించారు. తాను 19న ప్రెస్‌మీట్ పెట్టి కడిగిన తర్వాత మేలుకున్నారన్నారు. తాము ఒప్పుకోలేదని లేఖ రాశారని చెప్పారు. ఫిబ్రవరి 1న రెండో కేఆర్‌ఎంబీ మీటింగ్ జరిగిందని.. ఆ మీటింగులో కూడా ప్రాజెక్టులు ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు మినిట్స్‌లో ఉందన్నారు. అందులో పవర్ హౌజ్‌ల అప్పగింతకు మాత్రమే అభ్యంతరం చెప్పారని.. నీటి ప్రాజెక్టులపై మాత్రం అభ్యంతరం చెప్పలేదని మండిపడ్డారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు రెండు రాష్ట్రాల ఈఎన్సీలు చెప్పారన్నారు. కేసీఆర్ ఉన్నంత వరకు ప్రాజెక్టులు అప్పగించలేదని.. కాంగ్రెస్ వచ్చాకే ప్రాజెక్టులు కేంద్రం చేతిలో పెట్టి అడుక్కునే పరిస్థితి తెచ్చారన్నారు. రేవంత్ రెడ్డి అబద్దాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడపాలని అనుకుంటున్నారన్నారు. ఇది శాంపిల్ మాత్రమే అని అసెంబ్లీలో పూర్తి వివరాలు చెబుతామన్నారు.
ఆనాడు పెదవులు మూసుకుంది ఎవరు?..
‘‘పోతిరెడ్డి పాడు నుంచి నీరు తరలిస్తే పదవుల కోసం పెదవులు మూసుకున్నది మేము కాదు. నీ పక్కన ఉన్న ఉత్తమ్ రెడ్డి, కోమటిరెడ్డి పెదవులు మూసుకున్నారు. 610, పులిచింతల, వైఎస్ అన్యాయానికి వ్యతిరేకంగా జూలై 4, 2005న మేము కేబినెట్ నుంచి బయటకు వచ్చాం.. మేము బయటకు వచ్చాక మూడు నెలలకు పోతిరెడ్డి జీఓ వచ్చింది. టీడీపీలో ఉండి రేవంత్ ఆనాడు పెదవులు మూసుకున్నారు. పోతిరెడ్డి పాడుకు వ్యతిరేకంగా పోరాడింది మేము, పీజేఆర్. పోతిరెడ్డిపాడుపై 40 రోజులు అసెంబ్లీనీ స్తంభింపజేసినం’’ మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...