HARISHRAO: వారి సమస్యలు రేవంత్ ప్రభుత్వానికి పట్టవా.. హరీష్‌రావు ధ్వజం
ABN , Publish Date - Nov 17 , 2024 | 12:41 PM
కౌలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన పత్తి రైతులకు, కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం శాపంగా మారడం శోచనీయమన్నారు.
హైదరాబాద్: కౌలు రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై హరీష్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్)లో కౌలు రైతుల కష్టాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కౌలు రైతులకు రైతు భరోసా దేవుడెరుగు. కౌలు రైతులు తాము పండించిన పత్తిని మద్దతు ధరకు ఆమ్ముకోలేని దుస్థితికి వారి పరిస్థితి రాష్ట్రంలో దిగజారింది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం పత్తి పండించిన కౌలు రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలి’’ అని డిమాండ్ చేశారు.
కొనుగోళ్లలో నిర్లక్ష్యం...
అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన పత్తి రైతులకు, కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం శాపంగా మారడం శోచనీయమన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కనీస మద్దతు ధరకు కూడా అమ్ముకోలేని దుస్థితికి తెలంగాణ రైతాంగాన్ని చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పత్తి కొనుగోలు చేయబోమని రాష్ట్ర జిన్నింగ్, మిల్లుల యాజమాన్యాలు ప్రకటిస్తే సమస్యకు పరిష్కారం చూపే కనీస ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
రోడ్లెక్కిన పత్తి రైతులు..
పత్తి రైతులు రోడ్లెక్కి లబోదిబోమంటుంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా.. లేనట్లా అని ప్రశ్నించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అలసత్వం, సమన్వయ లోపంతో పత్తి రైతులు చిత్తవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని మండిపడ్డారు. పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఫొటోలకు ఫోజులిచ్చిన మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. పంట చేతికి వచ్చిన ఈ సమయంలో రైతుల జీవితాలతో చెలగాటమాడటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లుల వద్దకు చేరిన పత్తి లారీల లోడ్లతో రైతులు ఎన్ని రోజులు ఎదురుచూడాలని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడానికి సమయం ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులకు రైతుల సమస్యలు పట్టించుకునే సమయం లేదా అని ప్రశ్నించారు. తేమ శాతం సడలింపు, కొత్త నిబంధనల విషయమై ఢిల్లీకి వెళ్లి సీసీఐ అధికారులకు విజ్ఞప్తి చేసే తీరిక లేదా అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మొద్దునిద్ర వీడి తేమ శాతం సహా ఇతర నిబంధనల విషయంలో కేంద్రంపై, ఒత్తిడి తేవాలని, అన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు జరిగేలా చూడాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అంటూ హరీష్‌రావు ఎక్స్‌లో పోస్టు చేశారు.
రేవంత్ ప్రభుత్వం రైతుల నమ్మకాన్ని కోల్పోయింది..
రేవంత్ రెడ్డి పాలనలో రైతులు కష్టాలు పడుతున్నారన్నారు. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ తదితర పథకాలు అమలు చేయకపోవడంతో ప్రభుత్వం రైతుల నమ్మకాన్ని కోల్పోయిందని తెలిపారు. వరి కోతలు ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా ఇప్పుటికీ కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు హైదరాబాద్‌ను వీడి జిల్లాల్లో పర్యటించి రైతుల బాధలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని, లేదంటే రైతులతో కలిసి బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హరీశ్‌రావు హెచ్చరించారు. మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్. సీఎం అయ్యాక ఒక పంటకు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. అన్ని రకాల పంటలకు బోనస్ ఇస్తామన్నారని, ఇప్పుడు సన్నాలు అని చెప్పి, వాటిని కూడా కొనుగోలు చేయడంలేదని విమర్శించారు. రైతులు తక్కువ ధరకు పత్తిని అమ్ముకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు ఇప్పుడు ఆగిపోయాయని, కొత్త పథకాలు రాలేదని అన్నారు.
రైతు భరోసా ఏదీ..
‘‘కౌలు రైతులకు రైతు భరోసా ప్రస్తావనే లేదు. పంటలకు కనీస మద్దతు ధర ఊసే లేదు. 24 గంటల కరెంట్ ఇవ్వడం అబద్ధం. సీఎం వచ్చినా, మంత్రులు వచ్చినా నిరూపించేందుకు సిద్ధం. కేసీఆర్ రైతును రాజు చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తే.. కాంగ్రెస్ సర్కారు రైతన్నను ఆగం చేసింది. ఆరు గ్యారెంటీల అమలుకు చట్టం చేస్తామని.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. నమ్మి ఓటేసినందుకు రైతన్నను నట్టేట ముంచారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపంగా మారింది. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పాలకులు మరిచిపోయినట్లున్నారు. ఇప్పటికైనా కండ్లుతెరిచి రైతులందరికీ రుణమాఫీ చేయాలని, ఆందోళనలో ఉన్న రైతాంగానికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ సహా ఇతర జిల్లాల్లో రైతన్నలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే అరెస్టు చేసిన రైతన్నలకు అండగా బీఆర్ఎస్ పార్టీ కార్యచరణ ప్రకటిస్తుంది’’ అని ప్రభుత్వాన్ని మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు.