Share News

Hyderabad: అత్తాపూర్‌లో దారుణం.. ఇంటి అద్దె కట్టలేదని యజమాని దాష్టీకం..

ABN , Publish Date - Nov 11 , 2024 | 07:51 AM

అత్తాపూర్‌ హసన్ నగర్‌లోని ఓ ఇంట్లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఎప్పుడూ సక్రమంగానే అద్దె కట్టే ఆ కుటుంబం ఆర్థిక సమస్యల కారణంగా గత నెల రెంట్ చెల్లించలేదు. సరైన ఉపాధి లేకపోవడంతో వారు కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Hyderabad: అత్తాపూర్‌లో దారుణం.. ఇంటి అద్దె కట్టలేదని యజమాని దాష్టీకం..

రంగారెడ్డి: అత్తాపూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంటి అద్దె చెల్లించలేదని యజమాని చేసిన పని యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. అద్దెకు ఉంటున్న కుటుంబం రెంట్ కట్టలేదని రెచ్చిపోయిన ఓనర్ ఏకంగా కత్తితో దాడికి తెగబడ్డాడు. బాధిత కుటుంబానికి, అతనికి మధ్య జరిగిన స్వల్ప వివాదం చిలికిచిలికి గాలివానలా మారి కత్తితో దాడి చేసే వరకూ వెళ్లింది. ఈ ఘటనతో స్థానికులు నిర్ఘాంతపోయారు.


అత్తాపూర్‌ హసన్ నగర్‌లోని ఓ ఇంట్లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఎప్పుడూ సక్రమంగానే అద్దె కట్టే ఆ కుటుంబం ఆర్థిక సమస్యల కారణంగా గత నెల రెంట్ చెల్లించలేదు. సరైన ఉపాధి లేకపోవడంతో వారు కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజు గడవడం కూడా వారికి కష్టంగా మారింది. అయితే అద్దె చెల్లించాలంటూ ఇంటి యజమాని అడగడం మెుదలుపెట్టాడు. ప్రస్తుతం చేతిలో నగదు లేదని, మరికొన్ని రోజుల్లో చెల్లిస్తామని బాధిత కుటుంబం చెప్పింది. వారి సమాధానం నచ్చని ఓనర్ డబ్బుల గురించి పదేపదే అడిగాడు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడు.


కరెంట్ కట్ చేయడంపై బాధిత కుటుంబం యజమానిని ప్రశ్నించింది. రెంట్ కడితేనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తానని అతను తెగేసి చెప్పాడు. ఇదే విషయమై ఓనర్‌కు, ఆ కుటుంబానికి వాగ్వాదం జరిగింది. చిన్న విషయం కాస్త ఘర్షణకు దారి తీసింది. దీంతో రెచ్చిపోయిన యజమాని అద్దెకు ఉంటున్న కుటుంబంపై కత్తితో దాడికి తెగబడ్డాడు. విచక్షణారహితంగా యువతి తల, చేతిపై కత్తితో పొడిచి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాధితురాలిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Farmers: మిల్లర్ల మాయ

CM Revanth Reddy: పాలమూరుపై కేసీఆర్‌ నిర్లక్ష్యం

Updated Date - Nov 11 , 2024 | 07:53 AM