Hyderabad: భాగ్యనగరంలో బయటపడ్డ భారీ స్కామ్.. రంగంలోకి ఈడీ..
ABN , Publish Date - Mar 28 , 2024 | 06:21 PM
భాగ్యనగరంలో(Hyderabad) భారీ స్కామ్ వెలుగు చూసింది. నిరుద్యోగుల అవసరాలనే ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేసుకున్నారు కేటుగాళ్లు. పార్ట్ టైం ఉద్యోగాల(Part Time Jobs) పేరుతో భారీ మోసానికి తెరలేపారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 524 కోట్లు దోచేశారు కేటుగాళ్లు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు..
హైదరాబాద్, మార్చి 28: భాగ్యనగరంలో(Hyderabad) భారీ స్కామ్ వెలుగు చూసింది. నిరుద్యోగుల అవసరాలనే ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేసుకున్నారు కేటుగాళ్లు. పార్ట్ టైం ఉద్యోగాల(Part Time Jobs) పేరుతో భారీ మోసానికి తెరలేపారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 524 కోట్లు దోచేశారు కేటుగాళ్లు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు.. దేశ వ్యాప్తంగా నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టారు నిందితులు. హైదరాబాద్ సిసిఎస్ పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. ఈ కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దుబాయ్‌లో నుంచి ఆపరేట్ చేస్తున్న పార్ట్‌టైమ్ ఉద్యోగాల ముఠాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝుళిపించింది. ఉద్యోగాలు ఇస్తామంటూ రూ. 524 కోట్లకు పైగా డబ్బులను ఈ ముఠా వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో దేశ వ్యాప్తంగా నిరుద్యోగులను మోసం చేసినట్లు ఈడీ పేర్కొంది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే రూ. 524 కోట్లు వసూలు చేసింది ఈ ముఠా. 500 బ్యాంకులలో రూ. 32 కోట్ల పైచిలుకు నగదును ఈడీ అధికారులు ఫ్రీజ్ చేశారు. ఈ ముఠా క్రిప్టో (Crypto) కరెన్సీ ద్వారా నగదును దుబాయ్‌కి బదిలీ చేసుకున్నట్లు ఈడీ గుర్తించింది.
Also Read: సందడే సందడి.. వెంకటేష్‌తో బర్రెలక్క ఏడడుగులు..
మోసం ఇలా..
వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌ల ద్వారా పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇస్తారు. వీటికి ఆకర్షితులైన వారిని ఆయా గ్రూప్‌లలో యాడ్ చేస్తారు. ఫేక్ వెబ్‌సైట్, యాప్ ఇచ్చి బాధిత వ్యక్తుల మొబైల్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేయిస్తారు. వాటిలో లాగిన్ అవ్వాలంటే బ్యాంక్ వివరాలు, సహా కీలక సమాచారం అందించాల్సి ఉంటుంది. ఆ తరువాత వర్క్ పేరుతో కొన్ని టాస్క్‌లు ఇస్తారు. తొలుత అందరినీ నమ్మిస్తూ డబ్బులు చెల్లిస్తారు. ఆ తరువాత అసలు కథ మొదలు పెడతారు. అందినకాడికి దోచేసుకుంటారు. ఇలా దేశ వ్యాప్తంగా 50కి పైగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల కేసు నమోదు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. విచారణ చేపట్టింది. ఈ కేటుగాళ్లకు చెందిన పలు బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసింది.