Jagdish Reddy: రైతులను మోసగిస్తున్న రేవంత్ ప్రభుత్వం.. కాంగ్రెస్‌పై జగదీష్ రెడ్డి ధ్వజం
ABN , Publish Date - Oct 24 , 2024 | 08:31 PM
పత్తి రైతులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. గత వరదల్లో పత్తి రైతుల నష్టాన్ని అంచనా వేయలేదని అన్నారు. తెలంగాణ రైతులకు ఒకలా.. గుజరాత్ రైతులకు మరోలా పత్తికి మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని ధ్వజమెత్తారు.
సూర్యాపేట : ధాన్యం కొనుగోలుపై విధివిధానాలు లేవని మాజీమంత్రి , సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగ సమస్యలపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి వినతి పత్రం అందజేశారు. ఇవాళ (గురువారం) సూర్యాపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ... పత్తి రైతులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. మొన్న వచ్చిన వరదల్లో పత్తి రైతుల నష్టాన్ని ఎందుకు అంచనా వేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ రైతులకు ఒకలా.. గుజరాత్ రైతులకు మరోలా పత్తికి మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని ధ్వజమెత్తారు. వర్షాలకు నష్టపోయిన పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొని పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ఇంకా ప్రారంభం కాలేదని జగదీష్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వ సహకారం లేక ప్రైవేట్ దళారులను రైతులు ఆశ్రయిస్తున్నారని అన్నారు. దొడ్డు రకం ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పిన రేవంత్ ప్రభుత్వం.. ఇప్పుడు సన్న ధాన్యానికి బోనస్ పరిమితం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తుతున్నా ధాన్యం మిల్లర్లకు ఇవ్వడంపై ఇంకా మార్గదర్శకాలు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. సన్న ధాన్యం కస్టమ్ మిల్లింగ్‌పై మిల్లర్ల అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని నిలదీశారు. వారితో ఎందుకు చర్చిచడం లేదని ప్రశ్నించారు. అన్ని అంశాలపై గవర్నర్ కలగజేసుకుని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి రైతులను ఆదుకోవాలని జగదీష్ రెడ్డి వినతిపత్రం అందజేశారు.
మంత్రి జూపల్లి కృష్ణారావుపై హర్షవర్ధన్ రెడ్డి ఫైర్
మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతి రోజు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నారని గతంలో విమర్శలు చేయలేదా అని ప్రశ్నించారు. రాజకీయ విలువలు లేకుండా ఏ ఎండకి ఆ గొడుగు పట్టె వ్యక్తి జూపల్లి అని హర్షవర్ధన్ రెడ్డి విమర్శించారు.
11 నెలల్లో ఎన్ని కొత్త టూరిజం ప్రాజెక్టులు తెలంగాణకు తీసుకువచ్చారో చెప్పాలని హర్షవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీష్‌రావు గురించి మాట్లాడే జూపల్లి కృష్ణారావు.. సిద్దిపేటలా కొల్లాపూర్‌ని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి దగ్గర కావడానికి జూపల్లి కృష్ణారావు రావు హరీష్‌రావు, కేటీఆర్‌ని తిడుతున్నారని మండిపడ్డారు. జూపల్లి కృష్ణారావుతో చర్చించడానికి తాను సిద్ధమని హర్షవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు.
జూపల్లి స్వార్ధం కోసం ఎవరినైనా తిడుతారని అన్నారు. నాలుగు నెలల్లో నాలుగు దేశాల్లో జూపల్లి పర్యటించారని అన్నారు. పర్యాటక శాఖ మంత్రి సియోల్ ఎందుకు పోలేదని నిలదీశారు. టూరిజం గురించి వేరే శాఖ మంత్రులు మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన వయస్సుకు గౌరవం ఇచ్చి జూపల్లిలా తాము మాట్లాడటం లేదని అన్నారు. హరీష్ రావు, కేటీఆర్ గురించి ఇకమీదట మాట్లాడితే ఊరుకోమని హర్షవర్ధన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని అన్నారు. ప్రతి పక్ష నేతలపై ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్నారని హర్షవర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.