Justice Eswaraiah: ఇండియా కూటమికి బీసీ ఫెడరేషన్, బీసీ సంఘాల మద్దతు
ABN , Publish Date - Jan 13 , 2024 | 09:05 PM
ఇండియా కూటమికి బీసీ ఫెడరేషన్, బీసీ సంఘాలు మద్దతు ఇస్తాయని హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ వంగల ఈశ్వరయ్య ( Justice Eswaraiah ) తెలిపారు.
ఢిల్లీ: ఇండియా కూటమికి బీసీ ఫెడరేషన్, బీసీ సంఘాలు మద్దతు ఇస్తాయని హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ వంగల ఈశ్వరయ్య ( Justice Eswaraiah ) తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న బీసీ ఫెడరేషన్, బీసీ సంఘాల నాయకులు శనివారం రాహుల్ గాంధీనీ కలిశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ... బీజేపీ జాతీయ జనగణన చేయడం లేదు... ఎలాంటి విచారణ చేయకుండా అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు కేటాయించిందన్నారు.అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తానని చెబుతోందన్నారు. మండల కమిషన్ సిఫార్సులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
రామాలయం పేరుతో ఇంటింటికీ అక్షింతలు పెడుతున్నారని.. కుల, జనగణ మాత్రం చేపట్టడం లేదన్నారు. బీసీలకు రావాల్సిన వాటా, రావాల్సిన రిజర్వేషన్ రావడం లేదన్నారు. ఇండియా కుటమిలో ఒక్క రాహుల్ గాంధీ తప్ప మిగతా వారు బీసీ జనగణనపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాహుల్ భారత్ జూడో న్యాయయాత్రకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని.. అక్కడ బీసీ జనగణన చేపట్టాలని కోరారు. తెలంగాణలో బీసీ జనగణన చేపట్టడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న బీసీ జనాలు కాంగ్రెస్‌ని నమ్ముతారని చెప్పారు. బీసీలకు పొలిటికల్ పవర్ వస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు.
రాహుల్ గాంధీ బీసీ జనగణనపై పార్లమెంట్‌లో చర్చించారు: మధు యాష్కీగౌడ్
జస్టిస్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో బీసీ ఫెడరేషన్ తరఫున అన్ని రాష్ట్రాల నుంచి రాహుల్ గాంధీని కలిశామని మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్ ( Madhu Yashkigoud ) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీసీ జనగణన జరపాలని రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో చెప్పారన్నారు. మొట్టమొదటిసారి బీసీ ఫెడరేషన్ ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పిందన్నారు. ఇండియాకుటమికి దేశవ్యాప్తంగా ఉన్న బీసీ ఫెడరేషన్ మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని మధు యాష్కీగౌడ్ పేర్కొన్నారు.