Share News

TG GOVT: 317 జీవోలో సవరణ...వారికి ఊరట..

ABN , Publish Date - Nov 30 , 2024 | 09:45 PM

317జీవో బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్ కోసం వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

TG GOVT: 317 జీవోలో సవరణ...వారికి ఊరట..

హైదరాబాద్: 317 జీవో బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కల్పిచింది. స్థానిక కేడర్ పరస్పర అవగాహనతో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ జారీ చేసింది. ఒకే సబ్జెక్టు బోధించే ఇద్దరు ఉద్యోగులు ఒకరి స్థానంలోకి మరొకరు పరస్పర అవగాహనతో బదిలీ అయ్యేందుకు అవకాశాన్ని కల్పించింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు మేరకు 317జీవో బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్ కోసం వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆ మేరకు జీవో 245ను ప్రభుత్వం విడుదల చేసింది.

జీవో 317కు సంబంధించి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మార్గదర్శకాలు విడుదల చేసింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు జీవో 243, 244, 245 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. మ్యూచువల్, మెడికల్, స్పౌస్ ఆధారంగా 317 బాధిత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. మూడు కేటగిరీలకు సంబంధించి విడివిడిగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఖాళీల ఆధారంగా స్థానిక కేడర్లో మార్పు, బదిలీకి అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.


జీవో నంబరు 317 నేపథ్యం...

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పది జిల్లాలను 33 జిల్లాలుగా చేసింది. ఆయా జిల్లాల్లో పాలనా వ్యవహారాల కోసం వర్క్‌ టూ ఆర్డర్‌ కింద ఉద్యోగులను కేటాయించినా.. శాశ్వత కేటాయింపులు చేయలేదు. 2018 ఎన్నికలకు ముందు ప్రభుత్వ కొలువుల కేటాయింపులో కొత్త జోనల్‌ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలోని పది జిల్లాలు కలిపి జోన్‌5, జోన్‌ 6 కింద ఉండేవి. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి జిల్లాల సంఖ్య పెరిగిన తర్వాత రాష్ట్రం మొత్తాన్ని ఏడు జోన్లుగా, రెండు మల్టీ జోన్లుగా చేశారు. దీనికి కేంద్రం 2021లో ఆమోదం తెలిపింది.


అలాగే జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లుగా మూడంచెల కేడర్లను రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల పోస్టులను కేటాయిస్తూ సర్కారు జీవో జారీ చేసింది. కొత్త జోన్ల వ్యవస్థ ఏర్పాటుకావడంతో వాటికి ఉద్యోగాలను, ఉద్యోగులను సర్థుబాటు చేసే ప్రక్రియలో భాగంగా 2021 డిసెంబరు 6న జీవో నంబరు 317ను విడుదల చేసిన విషయం తెలిసిందే. పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలోని ఉద్యోగులు, ఆ పాత జిల్లాల పరిధిలోని కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలో తాము కావాలనుకున్న స్థానానికి వెళ్లేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.


సీనియారిటీ ప్రకారం ఉద్యోగుల బదిలీ..

ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్స్‌ మేరకు సీనియారిటీ ప్రకారం అక్కడున్న ఖాళీల ఆధారంగా ఉద్యోగులను బదిలీ చేసింది. అయితే, ఏదైనా జిల్లాలో తగినన్ని ఖాళీలు లేకపోతే.. ఆ జిల్లాకు ఆప్షన్‌ ఇచ్చినప్పటికీ ఖాళీలు ఉన్న మరో జిల్లాకు ఉద్యోగులను బదిలీ చేసింది. దీంతో స్థానికత, స్పౌజ్‌ కోటా తదితర అంశాలు తెరపైకి రాగా జీవో317కు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే జీవో 317 బాధితుల సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపసంఘాన్ని వేశారు. జీవో 317కు సంబంధించి ఉద్యోగుల వినతులపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం పలుమార్లు చర్చించింది. మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలోని ఉపసంఘం.. ఇప్పటికే స్పౌజ్‌, మెడికల్‌, మ్యూచువల్‌, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్త చేసుకున్న దరఖాస్తులపై సానుకూల నిర్ణయం తీసుకుంది. మిగిలిన అభ్యంతరాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులపై శాఖల వారీగా నివేదికలు సిద్ధం చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


నివేదికలో పలు సూచనలు..

ఇందులో భాగంగా.. ప్రత్యక్షంగా, ఆన్‌లైన్‌ విధానాల ద్వారా ఉద్యోగులు, ఉపాధ్యాయుల అభ్యంతరాలు, వినతులు స్వీకరించింది. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ముఖ్యంగా స్పౌజ్‌, మ్యూచువల్‌, మెడికల్‌ గ్రౌండ్‌ కేసులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వారం పది రోజుల్లో ఈ తరహా కేసులను వారివారి స్థానాలకు బదిలీ చేసే అవకాశాలున్నాయి. అలాగే, కొన్ని మండలాలు జిల్లాల పరిధి మారడంతో తలెత్తిన లోకల్‌, నాన్‌ లోకల్‌ సమస్యపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సూచించింది.

Updated Date - Nov 30 , 2024 | 09:56 PM