Share News

Hyderabad: కేంద్రంపై ఇక యుద్ధమే.. ఆర్.కృష్ణయ్య సంచలన ప్రకటన..

ABN , Publish Date - Nov 24 , 2024 | 07:25 PM

కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి పాటుపడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Hyderabad: కేంద్రంపై ఇక యుద్ధమే.. ఆర్.కృష్ణయ్య సంచలన ప్రకటన..
BC Welfare Association National President R. Krishnaiah

హైదరాబాద్: పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి వారికి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనగణనతోపాటు కులగణనా చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మొత్తం 18 డిమాండ్లతో సోమవారం "బీసీ రణభేరి" మహాసభను నిర్వహిస్తున్నట్లు ఆర్.కృష్ణయ్య సంచలన ప్రకటన చేశారు.


కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి పాటుపడాలని ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం అమలు చేసే బీసీ రిజర్వేషన్లను 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు. బీసీ రణభేరి సభకు అఖిలపక్షాన్ని ఆహ్వానించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అన్ని పార్టీల నేతలు రేపటి కార్యక్రమానికి వస్తున్నారని ఆర్.కృష్ణయ్య చెప్పారు.


బీసీలకు 75 ఏళ్లుగా దేశంలో అన్యాయం జరుగుతోందని ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీల డిమాండ్లు పరిష్కరించేంత వరకూ ఈ రణ భేరి గ్రామగ్రామాన కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. బీసీలు ఉద్యమాల్లో పాల్గొని నాయకత్వాన్ని పెంపొందించుకొని ప్రజా ప్రతినిధులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో పెద్దపెద్ద కంపెనీలకు రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని, కానీ 70 కోట్ల మంది బీసీల సంక్షేమానికి కేంద్రం రూ.2 వేల కోట్లు ఇవ్వడం సమంజసమేనా? అంటూ ప్రశ్నించారు.


మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 295 బీసీ కాలేజీ హాస్టళ్లు, 321 బీసీ గురుకుల పాఠశాలలకు ప్రత్యేక భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కృష్ణయ్య డిమాండ్ చేశారు. సరైన భవనాలు లేక వసతులు కొరవై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఎలా చదువుకుంటారని ఆయన ప్రశ్నించారు. అయితే పెద్దఎత్తున చేపట్టే బీసీ రణభేరి మహాసభను విజయవంతం చేయాలని ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి:

BRS: సీఎం రేవంత్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు..

KTR: ఉమ్మడి రాష్ట్రం నాటి నిర్బంధాలు మళ్ళీ వచ్చాయి..

Updated Date - Nov 24 , 2024 | 07:27 PM