Share News

BRS: కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం: కేటీఆర్

ABN , Publish Date - Nov 07 , 2024 | 11:32 AM

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని, వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని విద్యార్థుల అవస్థలు సీఎం రేవంత్ రెడ్డి కంటికి కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

BRS: కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం: కేటీఆర్

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) ఎక్స్ (Social Media) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.,)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోందని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. ‘‘కేసీఆర్‌పై కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా.. వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా సర్కార్ ఏం పొడుస్తున్నట్లు.. విద్యార్థుల అవస్థలు రేవంత్ రెడ్డి కంటికి కనిపించడం లేదా... నిమ్స్‌లో పేద పిల్లల హాహాకారాలు వినిపించడం లేదా.. పది రోజులుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యకృత్యమై... పేదల పిల్లలు గోడుగోడునా ఏడుస్తుంటే..కనీసం సమీక్ష అయినా నిర్వహించారా... విద్యాశాఖను అంటిపెట్టుకొని 11 నెలల్లో మీరు పీకిందేమిటి.. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులను అవస్థలకు గురి చేస్తిరి.. గురుకులాలకు తాళం పడేలా చేస్తిరి.. ప్రాథమిక పాఠశాలలకు శీతాకాలంలోనే ఒంటిపూట పెడితిరి.. కాంగ్రెస్ వచ్చింది.. సకల జనులను కన్నీళ్లు పెట్టిస్తోంది... మార్పుకు ఓటేసిన ఫలితం.. తెలంగాణను వెంటాడుతోంది పాపం.. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం’’ అంటూ కేటీఆర్ సోషల్ మీడియాలో ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.


రైతన్నల బాధలు..

‘‘తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం.. కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుంది.. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం.. కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తుంది.. మీసాలెందుకు రాలేదురా అంటే మేనత్త సాలు అని, గడ్డం ఎందుకు వచ్చిందిరా అంటే మేనమామ పోలిక అంటే ఏంటో అనుకున్నాం.. రుణమాఫీ, రైతుభరోసా, ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి కింద రూ.లక్ష 116, తులం బంగారం అడిగితే కాంగ్రెస్ నేతలు చెబుతున్న సాకులు చూస్తుంటే అర్దం అవుతుంది.. అందితే జుట్టు అందకపొతే కాళ్ళు ఏమో అనుకున్నాం ఓట్ల కోసం నాడు నిరుద్యోగుల కాళ్లు పట్టుకుని, నేడు వారి మీద నిర్దాక్షిణ్యంగా లాఠీఛార్జ్ చేస్తుంటే అర్దం అవుతుంది.. సుఖం వస్తే మొకం కడగడానికి తీరిక లేదంటే ఏమో అనుకున్నాం.. పది నెలల పాలనలో సీఎం, మంత్రుల 25కు పైగా ఢిల్లీ, 26కు పైగా విదేశీ పర్యటనలు చూస్తే అర్దం అవుతుంది.. తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు కుట్టిందంటే ఏమో అనుకున్నాం.. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో పేదలపై ప్రభుత్వ ప్రతాపం చూస్తుంటే అర్దం అవుతుంది.. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న ఏరు దాటిన తరువాత బోడ మల్లన్న అంటే ఏమో అనుకున్నాం.. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే అర్దం అవుతుంది’’ అంటూ కేటీఆర్ విమర్ళలు చేశారు.

ఈ ముగ్గురూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు..

సీఎం రేవంత్‌రెడ్డి, మేఘా అధినేత కృష్ణారెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఈ ముగ్గురూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. ఆంధ్రా కంపెనీ, ఈస్ట్‌ ఇండియా అరాచక కంపెనీ అని గతంలో విమర్శించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అదే మేఘా కంపెనీకి పలు కాంట్రాక్టులు ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. దొంగలు, దొంగలు కలసి ఊళ్లు పంచుకున్నట్లు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటినీ పొంగులేటికి చెందిన సంస్థ, మేఘా సంస్థకు కట్టబెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులు, ఇంజనీర్లు రేవంత్‌రెడ్డి చెప్పినట్లు సంతకం పెడితే మేము అధికారంలోకి వచ్చాక విచారణ ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్‌ ఉద్యోగం ఊడిపోతుందని, ఆ తర్వాత అధికారుల ఉద్యోగాలూ ఊడుతాయని వ్యాఖ్యానించారు.


సీఎం రేవంత్‌ రెడ్డి ఆగమాగం..

మూసీ ప్రాజెక్టు కోసం సీఎం రేవంత్‌ రెడ్డి ఆగమాగం అవుతున్నారని, ఇప్పటికిప్పుడు కాంట్రాక్టులు అప్పజెప్పి.. అక్రమంగా డబ్బులు రాబట్టాలని చూస్తున్నారన్నారు. కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి వెచ్చించనున్న రూ.4,350 కోట్లలో రేవంత్‌ రెడ్డి వాటా ఎంత.. ఢిల్లీ వాటా ఎంత.. అని నిలదీశారు. అమృత్‌ టెండర్లను సీఎం తన బావమరిదికి ఇచ్చిన విషయంలో కేంద్ర సంస్థలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి పని చేస్తున్నాయని, వాటి బాగోతాలను ఒక్కొక్కటిగా బయటపెడతానని అన్నారు. వాళ్లు, వీళ్లు జైలుకుపోతారని చెప్పడానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరు.. ఆయనేమైనా హోంమంత్రా.. పోలీస్‌ ఉన్నతాధికారా.. బాంబులు పేల్చడం కాదు.. ముందు ఆయనే జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండాలని కేటీఆర్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం (ఫోటో గ్యాలరీ)

20 రోజులుగా రైతన్నల బాధలు: కేటీఆర్

ఫార్ములా-ఈ రేసింగ్‌‌పై ఏసీబీ దూకుడు..

బోరుగడ్డ అనిల్‌కు పోలీసుల రాచమర్యాదలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 07 , 2024 | 11:32 AM