Hyderabad: నయా దందా.. మూసీయే వారికి ప్రధాన ఆదాయం..
ABN , Publish Date - Nov 26 , 2024 | 10:32 AM
అత్తాపూర్ బాపు ఘాట్ బ్రిడ్జి వద్ద కెమికల్ వ్యర్థాలను మూసీనదిలో కలుపుతున్న ట్యాంకర్లను స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తాండూర్, పటాన్ చెరు, షాద్ నగర్ సహా వివిధ ప్రాంతాలకు చెందిన కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలను తీసుకువచ్చి ఈ ప్రాంతంలో డంప్ చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు.
రంగారెడ్డి: అత్తాపూర్ బాపు ఘాట్ బ్రిడ్జి వద్ద కెమికల్ వ్యర్థాలను మూసీనదిలో కలుపుతున్న ట్యాంకర్లను స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తాండూర్, పటాన్ చెరు, షాద్ నగర్ సహా వివిధ ప్రాంతాలకు చెందిన కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలను తీసుకువచ్చి ఈ ప్రాంతంలో డంప్ చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. మూసీ వెంబడి ఖాళీ స్థలాన్ని కబ్జా చేసిన కొంతమంది వ్యక్తులు.. అక్కడ ఇసుక వ్యాపారం, లారీల పార్కింగ్ పెట్టారు. వాటి మాటున ఎవ్వరికీ అనుమానం రాకుండా నదిలో వ్యర్థాలు కలుపుతున్నారు.
కబ్జా చేసిన స్థలం నుంచి మూసీలోకి ఏకంగా పైప్ లైన్ ఏర్పాటు చేసి మరీ వ్యర్థాలు డంప్ చేస్తున్నారు. ఆ పైప్ లైన్ ద్వారా ప్రతిరోజు కనీసం 8 నుంచి 10 భారీ ట్యాంకర్ల వ్యర్థాలను నదిలోకి వదులుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో మూసీ కలుషితం కావడంతోపాటు, దుర్గంధం వెదజల్లుతోందని వారు మండిపడుతున్నారు. వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఏళ్లుగా ఇదే తంతు సాగుతోందని చెబుతున్నారు. లారీలు రావడం గమనించిన స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా.. నాలుగు లారీలతో డ్రైవర్లు పారిపోయారు.
కెమికల్ వ్యర్థాలు ఖాళీ చేస్తున్న లారీని మాత్రం పట్టుకోగలికారు. భారీ ట్యాంకర్ కావడంతో ట్రిప్పునకు రూ.25 వేలు చెల్లిస్తున్నట్లు డ్రైవర్ చెబుతున్నాడు. పొల్యూషన్ బోర్డ్ అధికారులతో కమ్మక్కై గత ఆరేడు సంవత్సరాలుగా ఈ దందా నడుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఒక్కో ట్యాంకర్‌లో 20 వేల లీటర్ల వ్యర్థాలు పడతాయని, అలాంటివి రోజుకు 10 ట్యాంకర్లు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.