TS NEWS: కేంద్ర హోంశాఖతో మల్లు రవి భేటీ.. ఏం చర్చించారంటే...?
ABN , Publish Date - Jan 29 , 2024 | 04:38 PM
కేంద్ర హోంశాఖ అధికారులతో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి(Mallu Ravi) సోమవారం నాడు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
ఢిల్లీ: కేంద్ర హోంశాఖ అధికారులతో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి(Mallu Ravi) సోమవారం నాడు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలో ఏపీ, తెలంగాణ భవన్ విభజన, ఆస్తుల పంపకానికి ఇరు రాష్ట్రాల అంగీకార పత్రాలను హోం శాఖ అధికారులకు మల్లు రవి అందజేశారు. హోంశాఖ త్వరగా నిర్ణయం తీసుకుంటే తెలంగాణ భవన్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. త్వరలో హోంశాఖ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పెండింగ్ అంశాలను తెలంగాణ రెసిడెంట్ కమిషనర్‌తో చర్చించి త్వరలో కేంద్ర అధికారులను కలిసి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ నిధుల గురించి హోంశాఖ అదనపు కార్యదర్శితో చర్చించినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వస్తే వాటిని పరిశీలిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అదనపు ఐపీఎస్ అధికారుల కేటాయింపుల అంశాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి మల్లు రవి తీసుకెళ్లారు. శబరి బ్లాక్ మూడున్నర ఎకరాలు, పటౌడి హౌస్ లో ఐదున్నర ఎకరాల భూమిని తెలంగాణకు.. గోదావరి బ్లాక్ , పటౌడి హౌస్, నర్సింగ్ హాస్టల్ భూ భాగం ఆస్తులు ఏపీకు తీసుకోవడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్లు తెలిపారు. త్వరగా నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ అదనపు కార్యదర్శిని కోరినట్లు చెప్పారు. హోం శాఖ నిర్ణయం తర్వాతే తెలంగాణ భవన్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదిస్తుందని.. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని మల్లు రవి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.