Share News

KCR : కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ.. ఏం చర్చించారంటే..

ABN , Publish Date - Dec 08 , 2024 | 05:36 PM

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కీలక భేటీ జరిగింది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం 1:30గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలతో పలు కీలక అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

KCR : కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ.. ఏం చర్చించారంటే..

సిద్దిపేట : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) అధ్యక్షతన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కీలక భేటీ జరిగింది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం 1:30గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలతో పలు కీలక అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల‌ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్గో బీఆర్‌ఎస్ ఓడిపోవడం కాంగ్రెస్ గెలవడం.. ఆపై రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి.


బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సంయుక్త సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డి, మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, నవీన్ కుమార్, మండలి విపక్ష నేత మధుసూదనాచారి, పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.


కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలి: కేసీఆర్

KCR.jpg

బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని తెలిపారు. ‘‘నాడు రైతుబంధు తీసుకువచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆవశ్యకత, పరిస్థితులను అందరికీ తెలియజేయాలి. నాడు తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తి గురించి చెప్పాలి. విగ్రహం మార్పు మూర్ఖత్వం, ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా. సమస్యలు, పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కానీ... మార్పులు చేసుకుంటూ పోతే ఎలా. ఫార్మాసిటీ ఎందుకు ప్రతిపాదించింది... పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను వివరించాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. నిర్భంద పాలన గురించి సమావేశాల్లో ప్రస్తావించాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రోటోకాల్ విషయంపై నిలదీయాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తిచూపాలి. ఫిబ్రవరిలో పార్టీ పరంగా బహిరంగ సభ నిర్వహించి సర్కార్ వైఖరి ఎండగడతాం. ఫిబ్రవరి తర్వాత పార్టీ అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత సభ్యత్వ నమోదు చేపడతాం’’ అని కేసీఆర్ వెల్లడించారు.


ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తాం: హరీష్‌రావు

Harish-Rao.jpg

మూడున్నర గంటల పాటు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం సాగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యు తన్నీరు హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేది రానిది మీరే చూస్తారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమల్లో వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రైతు బంధు, బోనస్ అంశాల్లో రైతులను ప్రభుత్వం మోసం చేసింది. లగచర్లలో భూ నిర్వాసితుల అంశం, అనంతరం జరిగిన పరిణామాలపై నిలదీస్తాం. దళితులు, గిరిజనులకు దళిత బంధు, బీసీలకు బీసీ బంధు నిలిపి వేశారు.. వాటి పైనా నిలదీస్తాం. శాసనసభ, మండలిలో ప్రజాసమస్యలపై గళం విప్పతా. ఒకవేళ ప్రభుత్వం చర్చకు కలసి రావాలని అడిగితే మోషన్ ఇచ్చి పట్టుపడతాం. హైడ్రా, మూసి సుదరికరణ అంశాలపైనా ప్రశ్నిస్తాం’’ అని హరీష్‌రావు తెలిపారు..


అమరవీరులకు నివాళులు

గన్ పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్దకు రేపు(సోమవారం) ఉదయం 9:30గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళి అర్పించనున్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం అసెంబ్లీ సమావేశాలకు వారు వెళ్లనున్నారు


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad: ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

JP Nadda: మభ్యపెట్టి.. అధికారంలోకి

Shankar journalist: తెలంగాణ తల్లి విగ్రహంపై అసభ్యకర పోస్టులు

Read Latest Telangana News and Telugu News

Updated Date - Dec 08 , 2024 | 07:46 PM