TS NEWS: కవితది అదే ప్లాన్.. ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 03 , 2024 | 06:18 PM
కేసీఆర్ కుటుంబం తెలంగాణను లూటీ చేసిందని.. ఆ విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(MLC Mahesh Kumar Goud) అన్నారు. కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తోందని మండిపడ్డారు.
హైదరాబాద్: కేసీఆర్ కుటుంబం తెలంగాణను లూటీ చేసిందని.. ఆ విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(MLC Mahesh Kumar Goud) అన్నారు. శనివారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తోందని మండిపడ్డారు. తాను నిజామాబాద్ కొడలునని కవిత మాట్లాడిన తీరుకి ఉసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని ఎద్దేవా చేశారు. కవిత మా జిల్లా కోడలు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజా పాలన అని వారే అంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇంద్రవెల్లి సభ దోహదపడిందని తెలిపారు.
నిన్న ఇంద్రవెల్లి సభ పార్టీ కార్యక్రమమని.. దానికి పార్టీ నుంచి ఖర్చు పెట్టామని అన్నారు.తమను కవిత లెక్కలు అడుగుతోందని.. బీఆర్ఎస్ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలన లెక్కలను తాము కవితని అడుగుతున్నామని అన్నారు. పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగినట్లు కవిత వ్యవహారం నడుస్తోందన్నారు. తమ హయాంలో కేసీఆర్ లాంటి తుగ్లక్ పాలన ఉండదని విమర్శించారు. కవిత తన స్థాయికి మించి మాట్లాడుతోందని మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.