Hydra: హైడ్రాకు రూ. 25 లక్షల ఎంపీ లాడ్స్ నిధులు.. చెక్కును అందజేసిన ఎంపీ అనిల్..
ABN , Publish Date - Aug 29 , 2024 | 05:54 PM
నగరంలో చెరువులు, కుంటలను ఆక్రమించి అక్రమ కట్టడాలకు తెర లేపిన అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది హైడ్రా. ఏ వైపు నుంచి వచ్చి ఏ కట్టడం కూల్చివేస్తుందోనని భయపడిపోతున్నారు కొందరు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రాకు మద్ధతుగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ నిధులు అందజేశారు.
హైదరాబాద్, ఆగష్టు 29: నగరంలో చెరువులు, కుంటలను ఆక్రమించి అక్రమ కట్టడాలకు తెర లేపిన అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది హైడ్రా. ఏ వైపు నుంచి వచ్చి ఏ కట్టడం కూల్చివేస్తుందోనని భయపడిపోతున్నారు కొందరు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రాకు మద్ధతుగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ నిధులు అందజేశారు. ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ. 25 లక్షలు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ అనిల్ కుమార్.. హైడ్రా పనితీరు బాగుందని, హైడ్రా మరింత చురుకుగా పని చేయాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్ నగరంలోని చెరువులను కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని ఎంపీ పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. హైదరాబాద్ మహానగరంగా తీర్చిదిద్దుతామన్నారని, కానీ అందుకు విరుద్ధంగా చేశారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌లోని చెరువులన్నీ కబ్జాకు గురయ్యాయన్నారు. కనీసం ఒక్క చెరువును కూడా కాపాడలేకపోయారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్ తరాల గురించి ఆలోచించి.. హైదరాబాద్ సస్యశ్యామలంగా ఉండాలని కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు. రాజకీయాల కోసం హైడ్రా అని కొందరు విమర్శలు చేస్తున్నారని.. ఇది హైదరాబాద్ అభివృద్ధి కోసం చేస్తున్నారని ఎంపీ స్పస్టం చేశారు.
దేశంలోని అనేక నగరాల్లో నీటి కొరత ఏర్పడుతుందని.. అలాంటి ఇబ్బందులు హైదరాబాద్‌లో రావొద్దనే ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు ఎంపీ. పదేళ్ల క్రితం నగరంలో అనేక చెరువులు నిండు కుండ మాదిరిగా ఉండేవన్నారు. అక్రమ కట్టడాలు చేపట్టిన వారు ఎవరైనా హైడ్రా వదిలిపెట్టదని ఎంపీ అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. డ్రగ్స్ నివారణ విషయంలో కూడా సీఎం ప్రత్యెక దృష్టి పెట్టారన్నారు. హైడ్రాను ఇతర జిల్లాలలో కూడా అమలు చేయాలనే వినతులు ప్రభుత్వానికి అందుతున్నాయని.. జిల్లాలకు హైడ్రా విస్తరించాలని ఎంపీ అభిప్రాయపడ్డారు. హైడ్రాకు పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులు పల్లం రాజు సోదరుడు ఇంటికి కూడా కూల్చివేశామని ఎంపీ అనిల్ గుర్తు చేశారు.