Hyderabad: భూప్రకంపనలపై ప్రముఖ శాస్త్రవేత్త ఏం చెప్పారంటే..
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:01 AM
ములుగు జిల్లా భూకంపంపై ప్రముఖ ఎన్‌జీఆర్ఐ విశ్రాంత శాస్త్రవేత్త నగేశ్ స్పందించారు. జన సంచారం లేని ప్రాంతంలో భూకంపం రావడం వల్ల పెనుప్రమాదం తప్పిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా విశ్రాంత శాస్త్రవేత్త సంచలన విషయాలు వెల్లడించారు.
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇవాళ(బుధవారం) ఉదయం భూకంపం తీవ్ర భయాందోళనలకు గురి చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మేడారం అడవుల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైనట్లు సమాచారం. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా భూప్రకంపనలు నమోదు అయ్యాయి. అయితే భూకంపంపై ప్రముఖ ఎన్‌జీఆర్ఐ విశ్రాంత శాస్త్రవేత్త నగేశ్ స్పందించారు.
ప్రముఖ శాస్త్రవేత్త ఏం చెప్పారంటే..
ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో శాస్త్రవేత్త నగేశ్ మాట్లాడుతూ.. "ఈరోజు ఉదయం వచ్చిన భూకంపం ములుగు జిల్లాలో సంభవించింది. జన సంచారం లేని ప్రాంతంలో ఇది రావడం వల్ల పెనుప్రమాదం తప్పింది. భూమికి 40 కిలోమీటర్ల లోపల భూకంపం రావడంతో దీని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో కనిపించింది. భూమిలో పగుళ్ల కారణంగా ఇలాంటివి ఏర్పడతాయి. గోదావరి బెల్ట్ ఏరియాలో భూమి లోపల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జన సంచారం లేని దగ్గర వచ్చింది కాబట్టి ఎటువంటి నష్టం జరగలేదు. హైదరాబాద్ నగరానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఆయా మున్సిపాలిటీల్లో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదు" అని హెచ్చరించారు.
భూకంప ప్రభావం ఇక్కడే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ, జగ్గయ్యపేట, రాజమండ్రి, పెనుగంచిప్రోలు, గంపలగూడెం, పాత తిరువూరు, మైలవరం, రెడ్డిగూడెం, నందిగామ, కంచికచర్ల, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు తెలుస్తోంది. అలాగే తూ.గో.జిల్లా దేవరపల్లి, గోపాలపురం మండలాలు, రాజమండ్రి తాడితోట, మోరంపూడి ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు భూమి కంపించినట్లు సమాచారం. ఇక అల్లూరి జిల్లా చింతూరు డివిజన్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఎటపాక, కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని పలు గ్రామాల్లో సైతం స్వల్పంగా భూమి కంపించింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భూప్రకంపనలు నమోదు అయ్యాయి. ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో భూకంప ప్రభావం కనిపించింది. ముఖ్యంగా ములుగు, మహబూబాబాద్ జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది. కుర్చీలో కూర్చున వారు సైతం కిందపడిపోయారని స్థానికులు చెబుతున్నారు. అలాగే హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడా, బోరబండ, రహమత్ నగర్, కార్మిక నగర్‌లో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. అలాగే సికింద్రాబాద్, బేగంపేట, హిమాయత్ నగర్, రాజేంద్రనగర్, హయత్ నగర్ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించిందని స్థానికులు చెబుతున్నారు.
నల్గొండ పట్టణం, సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(S) మండలం పాతర్లపాడు, నూతనకల్, హుజూర్ నగర్ ప్రాంతాల్లో సెకన్లపాటు భూమి కంపించినట్లు సమాచారం. గోదావరిఖని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజురాబాద్‌లో సైతం స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి. మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా కొన్ని సెకన్లపాటు ఇదే పరిస్థితి కనిపించింది. ఇల్లందులోనూ ఇదే పరిస్థితి. కరీంనగర్ విద్యానగర్‌లోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది. అయితే అన్ని జిల్లాల్లోనూ ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లల్లో ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
The High Court : పుష్ప-2 టికెట్ ధరలపై స్టే ఇవ్వలేం
Minister Sridhar Babu : రెరాతో ‘బిల్డ్‌నౌ’ అనుసంధానం