Phone Tapping Case: కీలక విషయాలు వెల్లడించిన ప్రణీత్‌రావు..
ABN , Publish Date - Mar 14 , 2024 | 12:04 PM
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వార్‌రూమ్‌లను ఏర్పాటు చేసుకోవడం సాధారణమే..! ప్రణీత్‌రావు ఏకంగా ఎస్‌ఐబీ కేంద్రంగా పలు జిల్లాల్లో వార్‌రూమ్‌లను ఏర్పాటు చేశారని పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు.. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు (hone Tapping Case)లో అరెస్టయిన (Arrest) మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు (Praneet Rao).. పోలీసుల విచారణలో కీలక విషయాలు (Key points) వెల్లడించారు. పోలీసులకు ఆయన ఇచ్చిన సమాచారం.. ‘‘అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ టాపింగ్ చేశాను. ఆ సమాచారాన్ని అప్పటి ఉన్నతాధికారులకే ఇచ్చాను.. ప్రజా ప్రతినిధులు (Political Leaders).. అధికారులు (Officers).. మీడియా (Media).. రియల్ ఎస్టేట్ (Real Estate) పెద్దల ఫోన్లను టాప్ చేశాను.. నాపైన ఉన్న ఎస్పీ స్థాయి అధికారులతో పాటు ఎస్ఐబీ చీఫ్ (SIB Chief)కు సమాచారం ఇచ్చాను.. కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశాను.. చాలామంది అధికారులు ప్రజా ప్రతినిధుల వాట్సాప్‌లపై నిఘా పెట్టాను.. అప్పటి మాజీ చీఫ్ ఆదేశాల మేరకు సమాచారాన్ని ధ్వంసం చేశాను.సెల్ ఫోన్లు, హార్డ్ డిస్కులు, వేల సంఖ్యలో పత్రాలను ధ్వంసం చేశాను’’ అంటూ వివరాలు వెల్లడించారు. కాగా ప్రణీత్ రావును మరొకసారి తిరిగి విచారించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వారం రోజులు కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఎస్ఐబీ మాజీ చీఫ్‌తో పాటు ఎస్పీ, డిఎస్పీ లను విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.
పూర్తి వివరాలు..
ప్రణీత్‌రావు పనిచేస్తుంది స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ)లోనే అయినా.. ఇతర విభాగాల సిబ్బందితో ప్రణీత్‌రావు దూరం దూరమే..! అక్కడ తనకంటూ రెండు గదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు..! అందుకు గత ప్రభుత్వ పెద్దల దన్ను..! వారికి మెహర్బానీ చేసేందుకు చెప్పిన చోట్ల వార్‌రూమ్‌ల ఏర్పాటు..! వారు చెప్పిన విపక్ష నేతలు, విపక్షాలకు ఎన్నికల నిధులిచ్చే వ్యాపారవేత్తల ఫోన్ల ట్యాపింగ్..! అక్రమ ఫోన్ ట్యాపింగ్‌లు, ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు వ్యవహారంలో పంజాగుట్ట పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో వెలుగుచూసిన వాస్తవాలివి..! అంతేకాదు.. తమ విచారణలో ప్రణీత్‌రావు నేరాలన్నింటినీ అంగీకరించాడని పేర్కొంటూ వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ కార్యాలయం బుధవారం రాత్రి మీడియాకు ప్రెస్‌నోట్ విడుదల చేసింది. దీన్ని బట్టి.. ప్రణీత్‌రావు ఎవరి ఆదేశాల మేరకు ట్యాపింగ్‌లు చేశాడో వెల్లడించినట్లు స్పష్టమవుతోంది. దీంతో.. గత ప్రభుత్వ పెద్దల చుట్టూ ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. అంతేకాదు..! ఎస్‌ఐబీలో మరో నలుగురు అధికారుల పేర్లను కూడా బయటపెట్టడంతో.. వారిని కూడా అరెస్టు చేయనున్నట్లు సూత్రప్రాయంగా తెలిసింది.
వార్‌రూమ్‌ల జోరు
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వార్‌రూమ్‌లను ఏర్పాటు చేసుకోవడం సాధారణమే..! ప్రణీత్‌రావు ఏకంగా ఎస్‌ఐబీ కేంద్రంగా పలు జిల్లాల్లో వార్‌రూమ్‌లను ఏర్పాటు చేశారని పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. వరంగల్ జిల్లాకు చెందిన ఓ కీలక నేత ఆదేశాలతో పర్వతగిరిలో ఓ వార్‌రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తేల్చారు. సదరు నాయకుడి ఆదేశాలతో విపక్ష నేతలతోపాటు.. కొంత మంది ప్రభుత్వ అధికారులు, విపక్ష నేతలకు నిధులను సమకూర్చే వ్యాపారవేత్తల ఫోన్లను ఎస్‌ఐబీలో ట్యాప్‌చేసి.. వెనువెంటనే పర్వతగిరి వార్‌రూమ్‌కు చేరవేసేవాడని నిర్ధారించినట్లు తెలిసింది. ఆ సమాచారం ఆధారంగా సదరు నేత తన రాజకీయ ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేసినట్లు.. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే ఈ కుట్ర జరిగినట్లు సమాచారం. ఈ విషయంలో ఎస్‌ఐబీ ఉన్నతాధికారులు ప్రణీత్‌రావుకు పూర్తిస్వేచ్ఛ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే క్రమంలో.. కరీంనగర్, సిద్దిపేట, గజ్వేల్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో వార్‌రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు పంజాగుట్ట పోలీసులకు ప్రణీత్‌రావు వాంగ్మూలమిచ్చినట్లు సమాచారం.
రహస్య ప్రదేశంలో విచారణ
మంగళవారం రాత్రి ప్రణీత్‌రావును అరెస్టు చేశాక.. యూసుఫ్‌గూడ సమీపంలోని ఓ రహస్య ప్రదేశంలో విచారించినట్లు తెలిసింది. ప్రాథమిక విచారణను సాంతం వీడియో రికార్డింగ్ చేసినట్లు సమాచారం. డీసీపీ విజయ్‌కుమార్ ఈ విచారణను స్వయంగా పర్యవేక్షించగా.. సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకున్నట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరికి దర్యాప్తు బాధ్యతలను అప్పగించారు. బుధవారం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. ప్రణీత్‌రావుకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అదే సమయంలో వారం రోజులపాటు ప్రణీత్‌రావును కస్టడీకి ఇవ్వాలంటూ పంజాగుట్ట పోలీసులు పిటిషన్ వేశారు. ఒకట్రెండు రోజుల్లో ఈ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.
వజ్రాల వ్యాపారి కోసం..
గత ప్రభుత్వ పెద్దల కోసం ఫోన్ ట్యాపింగ్‌లు చేసిన ప్రణీత్ రావు.. స్వామికార్యంతోపాటు.. స్వకార్యాన్ని నెరవేర్చుకున్నట్లు దర్యాప్తు అధికారులు ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. ఓ ప్రముఖ వజ్రాల వ్యాపారి తన ప్రత్యర్థుల వ్యూహాలను తెలుసుకునేందుకు ప్రణీత్‌రావు వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు సమాచారం. అందుకు ప్రతిగా ప్రణీత్‌రావుకు సదరు వజ్రాల వ్యాపారి నుంచి భారీగా నజరానాలు దక్కినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
ప్రణీత్‌రావుపై మరో ఫిర్యాదు
ప్రణీత్‌రావు తమ కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారంటూ సంధ్య కన్వెన్షన్ ఎండీ, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీధర్‌రావు తన అడ్వొకేట్ అరుణ్ ద్వారా బుధవారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో నా ఫోన్‌తోపాటు.. నా కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారు. నన్ను తీవ్ర ఇబ్బందులపాలు చేశారు. ఓ సంస్థలో ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న ఇ.సాంబశివరావు అనే వ్యక్తి తనకు మంత్రులు, పోలీసులతో మంచి పరిచయాలున్నాయని, నాతో వ్యాపారాలు చేస్తానని చెప్పి నమ్మించారు. ఆ తర్వాత మా మధ్య గొడవలు రావడంతో అతణ్ని దూరం పెట్టాను. ఆ తర్వాత నా ఫోన్లను ట్యాప్ చేయించి, 40కి పైగా అక్రమ కేసులు పెట్టారు. ప్రణీత్‌రావుతోపాటు.. ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు, వారి సామాజిక వర్గానికి చెందిన మరికొందరు పోలీసు అధికారులు ఈ కుట్ర వెనక ఉన్నారు. ఆ అధికారులు నాతో నేను ఏం చేస్తున్నానో.. ఎవరితో ఏం మాట్లాడుతున్నానో అన్నీ తెలుసంటూ పలుమార్లు బెదిరించారు. రాజ్యాంగం కల్పించిన నా వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతకు భంగం కలిగించే విధంగా నాపై కుట్రలు చేశారు’’ అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.