JNTU Hyderabad: ఆహారం పిల్లి తిన్నదన్న అంశంపై జేఎన్టీయూ సీరియస్..
ABN , Publish Date - Jul 17 , 2024 | 07:51 PM
ఆదివారం రోజున జేఎన్టీయూ(JNTU) బాయ్స్ హాస్టల్లో ఆహారాన్ని పిల్లి తినడంపై యాజమాన్యం స్పందించింది. ఆహారాన్ని పిల్లి తినలేదని అధికారుల బృందం తేల్చిందని ప్రిన్సిపల్ నర్సింహారెడ్డి(Principal Narsimha Reddy) చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే వీడియోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారంటూ ఆయన సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై విచారణ చేపట్టినట్లు ప్రిన్సిపల్ చెప్పుకొచ్చారు.
హైదరాబాద్: ఆదివారం రోజున జేఎన్టీయూ(JNTU) బాయ్స్ హాస్టల్లో ఆహారాన్ని పిల్లి తినడంపై యాజమాన్యం స్పందించింది. ఆహారాన్ని పిల్లి తినలేదని అధికారుల బృందం తేల్చిందని ప్రిన్సిపల్ నర్సింహారెడ్డి(Principal Narsimha Reddy) చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే వీడియోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారంటూ ఆయన సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై విచారణ చేపట్టినట్లు ప్రిన్సిపల్ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.." నిజానికి హాస్టల్లో ఓ కిటికీ తెరిచిన కారణంగా పిల్లి లోపలికి వచ్చింది. అది కూడా హాస్టల్ పూర్తిగా మూసివేసిన తర్వాత లోపలికి చొరబడింది. విద్యార్థులు భోజనం ముగించిన తర్వాతే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆహారం తినే సమయంలో విద్యార్థులు, సిబ్బంది ఉంటారు కాబట్టి పిల్లులు వచ్చే అవకాశం లేదు. వసతి గృహంలో ఆహార పదార్థాలను పిల్లి తిన్నదా లేదా అనే అంశాన్ని కూకట్పల్లి గవర్నమెంట్ ఫుడ్ వెరిఫికేషన్ కమిటీ అధికారులు పరిశీలించారు. ఎలాంటి వంటకాలను అది ముట్టుకోలేదని వారు చెప్పారు. కొంతమంది విద్యార్థులు ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. విద్యార్థులు ఈ అంశాన్ని మెస్ సిబ్బంది, వార్డెన్ లేదా నాకు కూడా చెప్పకుండా సోషల్ మీడియాలో పెట్టడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దురుద్దేశపూర్వకంగానే వారు ఈ పని చేసినట్లు నాకు ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించి బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం" అని చెప్పారు.
అయితే యూనివర్సిటీ క్యాంపస్‌లోని మంజీరా బాయ్స్ హాస్టల్లో ఆహార పదార్థాల నాణ్యత, శుభ్రతపై గత కొంతకాలంగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. రుచి, శుచికరమైన భోజనం అందించాలంటూ ఇప్పటికే పలుమార్లు అధికారులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని పైగా ఫిర్యాదులు, ఆందోళనలు చేసిన తమపైనే చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితమే సుల్తానాబాద్ జేఎన్టీయూ క్యాంటీన్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. చట్నీలో ఎలుక కనిపించడంతో విద్యార్థులు, సిబ్బంది నోరెళ్లబెట్టారు. ఈ సంఘటన మరవక ముందే ఇప్పుడు కూకట్పల్లి జేఎన్టీయూహెచ్‌లోనూ ఆహారాన్ని పిల్లి తిన్నదంటూ వచ్చే ఆరోపణలు కొట్టిపారేయలేమని కొందరు విద్యార్థులు అనుకుంటున్నారు.