Crime News: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. చిన్నారుల అమ్మకాల గుట్టురట్టు..
ABN , Publish Date - May 28 , 2024 | 04:30 PM
తెలుగు రాష్ట్రాల్లో పిల్లలను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విక్రయిస్తున్న ముఠా అరెస్టు సంచలనంగా మారింది. 13మంది చిన్నారులను కాపాడి 11మంది నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.
Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో పిల్లలను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విక్రయిస్తున్న ముఠా అరెస్టు సంచలనంగా మారింది. 13మంది చిన్నారులను కాపాడి 11మంది నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు. ఢిల్లీ, పూణే నుంచి ఏడాది లోపు ఉన్న పిల్లలను అక్రమంగా తీసుకొచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో నిందితులు అమ్మకాలు చేశారు. సంతానం లేని వారికి ఒక్కొ చిన్నారిని రూ.3.5లక్షలకు అమ్మినట్లు సీపీ తెలిపారు.
కొనుగోలు చేసిన తల్లిదండ్రులు ఆందోళన..
13మంది పిల్లలను కొనుగొలు చేసిన వారి నుంచి రాచకొండ పోలీసులు రెస్క్యూ చేశారు. అయితే కొనుగోలు చేసిన తల్లిదండ్రులు చిన్నారులను తిరిగి అప్పగించాలంటూ రాచకొండ సీపీ కార్యాలయం వద్ద ఆందోళన దిగారు. తాము పెంచుకోవడానికే పిల్లలను కొనుగోలు చేశామని తిరిగి అప్పగించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తీగలాగితే డొంక కదిలిందిలా..
ఇటీవల మేడిపల్లిలో నెల నుంచి రెండేళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నట్లు రాచకొండ పోలీసులకు సమాచారం అందింది. పిల్లలు లేని వారికి ఢిల్లీ, పూణెల నుంచి చిన్నారులను తెచ్చి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేశారు. శోభ రాణి, సలీం, స్వప్న అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేసిన సమయంలో 23రోజులు, నెల రోజులు ఉన్న ఇద్దరు చిన్నారులను రక్షించారు. ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టగా మానవ అక్రమ రవాణా రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు 8మందిని అరెస్టు చేసినట్లు సీపీ తరుణ్ జోషి వెల్లడించారు. ఢిల్లీ, పూణెలో ఉన్న ముఠా సభ్యులనూ పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లు వెళ్లినట్లు సీపీ వివరించారు.