Share News

Hyderabad: అల్లం వెల్లుల్లి పేస్టు కొంటున్నారా.. ముందు ఇది చూడండి..!

ABN , Publish Date - May 18 , 2024 | 10:38 AM

డబ్బు సంపాదన కోసం కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. కనిపించిన ప్రతి వస్తువును నకిలీగా మారుస్తున్నారు. ఇటీవల కాలంలో బ్రాండెడ్‌ వస్తువులను నకిలీవి తయారు చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో కొంతమంది నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టును తయారు చేసి బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టు కొనుగోలు చేసిన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.

Hyderabad: అల్లం వెల్లుల్లి పేస్టు కొంటున్నారా.. ముందు ఇది చూడండి..!
Ginger Adulteration

డబ్బు సంపాదన కోసం కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. కనిపించిన ప్రతి వస్తువును నకిలీగా మారుస్తున్నారు. ఇటీవల కాలంలో బ్రాండెడ్‌ వస్తువులను నకిలీవి తయారు చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో కొంతమంది నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టును తయారు చేసి బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టు కొనుగోలు చేసిన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటీవల రాజేంద్రనగర్‌ ఎస్వోటీ పోలీసులు పరిశ్రమలపై జరిపిన దాడుల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రాజేంద్రనగర్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): నగర శివారు ప్రాంతాలలో కొంత మంది ఎలాంటి అనుమతులు లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేసి గుట్టు చప్పుడుకాకుండా నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్నారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని కాటేదాన్‌, ఎంఎం పహడీ, చింతల్‌మెట్‌, రాజేంద్రనగర్‌ తదితర ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకొన్నారు. ఆయా పరిశ్రమలో ఎటువంటి నిబంధనలు పాటించకుండా అపరిశ్రుమైన వాతావరణంలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్నారు. కుళ్లిపోయిన అల్లం, పాడైన వెల్లుల్లి గడ్డలను తీసుకుని అల్లం, వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్నారు. అల్లం, వెల్లుల్లి పేస్ట్‌లో రంగు రావడానికి వెనిగర్‌, ఎసిటక్‌ యాసిడ్‌, సింథటిక్‌ కలర్‌ కలుపుతున్నారు. ఇలా తయారు చేసిన నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టును అందమైన కవర్లలో ప్యాక్‌ చేసి బహిరంగా మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వాటిని కొనుగోలు చేసి తిన్న ప్రజలు అనారోగ్యాలకు గురువుతున్నారు.


హానికరమైన రంగులను కలుపుతూ..

అపరిశుభ్రమైన వాతావరణంలో సింథటిక్‌ కెమికల్స్‌ వేసి తయారు చేసిన 3,500 కిలోల నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను పోలీసులు గతంలో స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి లూజు సోడియ బెంజోయేట్‌ రసాయన పొడి, గమ్‌ పౌడర్‌, రంగు కోసం వాడుతున్న పసుపు పొడి, స్టిక్లర్లు, ప్యాకింగ్‌ పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. వీరు రోషన్‌ అల్లం వెల్లుల్లీ పేస్ట్‌, మాస్‌ డైమండ్‌, స్వచ్చమైన అల్లం పేర్లతో అల్లం వెల్లుల్లీ పేస్ట్‌ను విక్రయిస్తున్నట్లు ఎస్‌ఓటీ పోలీసులు కనుగొన్నారు. అల్లం, వెల్లుల్లి పేస్ట్‌లో సింథటిక్‌ ఫుడ్‌కలర్‌, గమ్‌ పౌడర్‌, సోడియం బెంజోయేట్‌(నెప్రోటాక్సిక్‌ పదార్థం), మృధత్వం కోసం కెమికల్‌ పౌడర్‌, చెడిపోయిన వెల్లుల్లి తొక్కలను వాడి అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.


2023, మే7న శాంతినగర్‌లో..

2023 మే 7న కాటేదాన్‌ శాంతినగర్‌ కాలనీలో ఫిరోజ్‌అలీ, అజిత్‌ అనే ఇద్దరు వ్యాపారులు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారీ చేస్తూ పరిశ్రమలో పట్టుబడ్డారు. వారి నుంచి అల్లం వెల్లుల్లి తయారు చేసే ఎనిమిది యంత్రాలు, 50 కిలోల శాంతన్‌ కమ్‌ ఫుడ్‌గ్రేడ్‌ ప్యాకెట్లు, 210 లీటర్ల ఎసిటిక్‌ యాసిడ్‌, 550 కేజీల ఖానా ఖజనా నాన్‌వెజ్‌ మసాల ప్యాకెట్లు, ఒక కార్టన్‌ లిటిల్‌ చాంప్స్‌ మ్యాంగో డ్రింక్స్‌, టన్ను వెల్లుళ్లి సంచులు, 20 పౌచ్‌ల కిచెన్‌చాట్‌, 500 కిలోల జిగ్నర్‌ వెలుల్లి పేస్లు స్వాధీనం చేసుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్టులో అసలు అల్లం వాడటం లేదని, దానికి బదులు రసాయనాలు ఉపయోగిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఎనిమిది మిషన్‌ల ద్వారా పదిమంది కార్మికులతో రోజూ పెద్ద మొత్తంలో అల్లం వెల్లులి ఫేస్ట్‌ తయారు చేసి నగరంలోని వివిధ దుకాణాలలో విక్రయిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్‌తోపాటు చిక్కీలు, బెల్లం పట్టీలు, నువ్వుల లడ్డూలు తయారు చేస్తున్నట్లు కనుగొన్నారు.


కాటేదాన్‌ సుభాన్‌ కాలనీలో..

2024 మార్చి 9న కాటేదాన్‌ సుభాన్‌ కాలనీలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేస్తున్న స్థావరంపై ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో సింథటిక్‌ కెమికల్స్‌ వేసి, అపరిశుభ్రమైన వాతావరణంలో నకిలీ అల్లం వెల్లుల్లీ పేస్ట్‌ను అనుమతులు లేకుండా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పరిశ్రమను నడుపుతున్న చార్మినార్‌ రంగేలికిడికికి చెందిన హహ్మద్‌ అహ్మద్‌(34)ను అరెస్ట్‌ చేశారు. రూ.2.8 లక్షల విలువ చేసే యంత్రాలు, నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ముడిసరుకులు స్వాధీనం చేసుకున్నారు. పరిశ్రమ నిర్వాహకుడు మహ్మద్‌ అహ్మద్‌ తీసుకున్న లైసెన్సు రెండేళ్ల క్రితమే ముగిసినట్లు పోలీసులు అప్పట్లో కనుగొన్నారు.


రెండు నెలల క్రితం..

నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేస్తుండగా రెండు నెలల క్రితం ఎస్వోటీ పోలీసులు పలు స్థావరాలపై దాడి నిందుతులను పట్టుకున్నారు. రాజేంద్రనగర్‌లోని ఖాధీ గ్రామోద్యోగ్‌ మహావిద్యాలయంలో, ఎంఎం పహడీ లక్కీ ఫంక్షన్‌హాల్‌ సమీపంలో, కాటేదాన్‌ శాంతినగర్‌లో, కాటేదాన్‌ సుభాన్‌కాలనీలోని పలు స్థావరాలపై ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను పట్టుకున్నారు.

For More Hyderabad News and Telugu News..

Updated Date - May 18 , 2024 | 10:38 AM