Ravindra Naik: కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఉచ్చు బిగుస్తుంది.. బీజేపీ నేత హాట్ కామెంట్స్
ABN , Publish Date - Feb 22 , 2024 | 04:49 PM
తెలంగాణను బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) దోచుకుని వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత రవీంద్రనాయక్ (Ravindra Naik) ఆరోపించారు. కేసీఆర్ చేసిన తప్పులపై సీబీఐ, ఈడీ చేత విచారణ జరపాలని కోరుతూ రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి , ఈడీ, సీబీఐ డైరెక్టర్లకు లేఖ రాశానని చెప్పారు.
ఢిల్లీ: తెలంగాణను బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) దోచుకుని వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత రవీంద్రనాయక్ (Ravindra Naik) ఆరోపించారు. గురువారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ చేసిన తప్పులపై సీబీఐ, ఈడీ చేత విచారణ జరపాలని కోరుతూ రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి , ఈడీ, సీబీఐ డైరెక్టర్లకు లేఖ రాశానని చెప్పారు. తెలంగాణలో పుష్కరాల పేరిట రూ.1200 కోట్లను కేసీఆర్ దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఎస్టీ, ఎస్సీ నిధులను కేసీఆర్ దారిమళ్లించి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా కేసీఆర్ దుర్వినియోగం చేశారని... వీటిపై విచారణ జరిపి ఆ నిధులను ప్రజలకు చేరేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
తెలంగాణలో ప్రభుత్వ భూములను కేసీఆర్ కొట్టేశారని... భవిష్యత్ అవసరాలకు ప్రజలకు భూమిని లేకుండా చేశారని విరుచుకుపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అవినీతిపై ఉచ్చు బిగుస్తుందని... ప్రధాని మోదీ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారని అన్నారు. గిరిజనుల నిధులను ఉపయోగించి కట్టిన ట్రైబల్ యూనివర్సిటీలో 50 శాతం గిరిజన పిల్లలకు అవకాశం ఇవ్వాలని కోరారు. 12 శాతం గిరిజన జనాభా ఉంటే రిజర్వేషన్లు 7.5 శాతం మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. గిరిజన కమిషన్‌లో ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేరుచేసి ఎస్టీలకు ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కూడా కలవబోతున్నామని రవీంద్రనాయక్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...