Telangana: అది చూసి ఏడ్చేశాను.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ABN , Publish Date - Aug 30 , 2024 | 03:26 PM
సీఎం రేవంత్ పాలనా విధానాలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. హైడ్రా అందరికీ ఒకే న్యాయం పాటించాలన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలి కానీ.. పేదలకు ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయం ఉండకూడదన్నారు.
హైదరాబాద్, ఆగష్టు 30: సీఎం రేవంత్ పాలనా విధానాలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. హైడ్రా అందరికీ ఒకే న్యాయం పాటించాలన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలి కానీ.. పేదలకు ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయం ఉండకూడదన్నారు. పేదల పైన వెంటనే యాక్షన్ తీసుకుంటున్న హైడ్రా..దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించారు.
ఆ దృశ్యం చూసి ఏడ్చేశాను..
మహబూబ్ నగర్లో అంధుల కాలనీలో అధికారులు ఇళ్ళు కూలుస్తున్నపుడు శిథిలాల్లో యూనిఫామ్ వేసుకున్న ఒక అమ్మాయి తన బుక్స్ వెతుక్కుంటోంది. ఈ దృశ్యం చూసి నాకు ఏడుపు వచ్చింది. సీఎంకి ఎలా నిద్రపడుతోంది? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 400 మంది పోలీసులతో అంధుల కాలనీ కూల్చిన అధికారులు.. అంతే మంది పోలీసులు తిరుపతి రెడ్డి ఇంటికి వెళ్లి ఎందుకు కుల్చరు? అని ప్రశ్నించారు. పేద ప్రజలపై ప్రతీకార పాలనలాగా రేవంత్ పాలన నడుస్తోందని విమర్శించారు.
గురుకులాలు నిర్వీర్యం..
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు నిర్వీర్యం అయ్యాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో 9 నెలలుగా విద్యాశాఖకు మంత్రి లేరని విమర్శించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం ఎప్పుడైనా సమీక్ష జరిపారా? అని ప్రశ్నించారు. విద్యాశాఖపై సీఎంకు కనీస అవగాహన లేదని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని.. విద్యార్థులకు యూనిఫామ్స్ లేవు, చలికాం వస్తుంది ఉలన్ రగ్గులు లేవు, బూట్లు ఇవ్వలేదని ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన ప్రజా పాలన కాదని.. ప్రతీకార పాలన సాగుతోందని విమర్శించారు.
ఉద్యోగాలు మానేసేలా కుట్ర..
చాలా కాలేజీల యాజమాన్యాలు ఫీజులు కట్టడం లేదనే కారణంగా మెమోలు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం గురుకులాల్లో పేద విద్యార్థులు ఎంబీబీస్, ఐఐటీలు సాధించాలని సెంటర్ ఆఫ్ ఎక్ససెలెన్సు ఏర్పాటు చేశారని.. కానీ, ఇప్పుడు వాటిని ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గెస్ట్ ఫాకల్టీకి నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. వాళ్లు ఉద్యోగాలు మానేసేలా ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. పేద విద్యార్థులంటే రేవంత్ రెడ్డికి ఎందుకు కోపం అని ప్రశ్నించారు. వెంటనే గురుకుల కాలేజీల గెస్ట్ ఫాకల్టీకి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ స్కూళ్లలో కూడా అధ్యాపకుల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యా భరోసా కిందా ఒక్కో విద్యార్థికి రూ.5 లక్షలు ఇస్తామన్నారని.. ఒక్క పైసా అయినా విడుదల చేశారా? అని ప్రభుత్వాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
ధార్మిక సంస్థలొద్దు..
కేసీఆర్ గురుకుల విద్యాలయాలను 250 నుంచి 1000 వరకు పెంచారన్నారు. దేశంలోనే రోల్ మోడల్‌గా గురుకులాలను తీర్చిదిద్దారని చెప్పారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గురుకులాలను విస్మరిస్తోందన్నారు. గురుకులాల్లో అన్ని వర్గాల విద్యార్థులు విద్యను పొందుతున్నారని, అక్షయ పాత్త్ర సంస్థను విద్యాలయాలకు అంటకట్టడం సరికాదన్నారు. ధార్మిక సంస్థల భోజన విధానాన్ని అమలు చేయొద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బ్రహ్మ కుమారి, అక్షయ పాత్ర సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు మానుకోవాలన్నారు. పేద విద్యార్థుల మీద ప్రయోగాలు చేయొదన్నారు. ఖైదీల తిండి కోసం రూ. 83 ఖర్చు చేస్తోందని.. కానీ విద్యార్థుల తిండి కోసం రూ. 37 మాత్రమే ఖర్చు చేస్తోందని విమర్శించారు.
ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు..
అన్నమో రామచంద్ర అంటూ సగం పొట్టతో గురుకులాల్లో విద్యార్థులు పస్తులు వుంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురుకుల విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. గురుకులాల్లో పాము కాట్లకు గురై విద్యార్థులు చనిపోతున్నారని.. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో తన తమ్ముడికి సంబంధించిన కంపెనీ ద్వారా మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానాలున్నాయన్నారు. దీనిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలన్నారు.