Telangana Assembly : 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ.. సభ ముందుకు కీలక బిల్లులు
ABN , Publish Date - Dec 08 , 2024 | 09:37 PM
రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి గవర్నర్ నుంచి ఆమోదం లభించింది. దాంతో శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఉత్తర్వులను జారీ చేశారు. అసెంబ్లీతో పాటే శాసన మండలి సమావేశాలు కూడా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఖరారయ్యాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10:30గంటలకు శాసనసభ, శాసన మండలి ఉభయ సభలు ప్రారంభం అవుతాయి. మొదటి రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. సభలో ఏడు చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వంప్రవేశ పెట్టనుంది.
గవర్నర్ ఆమోదం ..
ఈనెల 9వ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి గవర్నర్ నుంచి ఆమోదం లభించింది. దాంతో శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఉత్తర్వులను జారీ చేశారు. అసెంబ్లీతో పాటే శాసన మండలి సమావేశాలు కూడా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 9న ఉదయం 10.30 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో రెండు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, రికార్డ్స్ ఆఫ్ రైట్స్(ఆర్‌వోఆర్) బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గతంలో ఇద్దరు వరకు సంతానం ఉన్న వారికి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండేది. అయితే ప్రభుత్వం దీనిని సవరించి ముగ్గురి సంతానం ఉన్నా పోటీ చేసే అవకాశం కల్పించబోతోంది.
సభ ముందుకు ఐదు ఆర్డినెన్సులు...
రేపు శాసన సభ ముందుకు ఐదు ఆర్డినెన్సులు, రెండు వార్షిక నివేదికలు రానున్నాయి. తెలంగాణ జీతాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు (సవరణ) ఆర్డినెన్సును సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టనున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (సవరణ) ఆర్డినెన్సు 2024ను సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (సవరణ) ఆర్డినెన్సు 2024ను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టనున్నారు. తెలంగాణ వస్తువుల, సేవల పన్ను (సవరణ) ఆర్డినెన్సు 2024ను సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) ఆర్డినెన్సు 2024ను సభలో మంత్రి సీతక్క ప్రవేశ పెట్టనున్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ 9వ వార్షిక నివేదిక 2022-23 ప్రతిని సభకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివేదించనున్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదిక 2021-22 ప్రతిని సభకు మంత్రి కొండా సురేఖ నివేదించనున్నారు.
ఆర్‌వోఆర్ బిల్లు..
దీనికి సంబంధించినదే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు. అలాగే ప్రస్తుత రెవెన్యూ చట్టంలో మార్పులు చేసి, కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఆర్‌వోఆర్ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోనుంది. అలాగే ఇదివరకు ఉన్న గ్రామ సహాయకులు(వీఏవో), గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్‌వో) తరహాలో ప్రభుత్వం ఒక కొత్త పోస్టును సృష్టించి, నియామకాలు చేయనుంది. సర్వీసులో ఉన్న కొంత మందిని, ప్రత్యక్ష ఎంపిక ద్వారా మరికొంత మందిని ఈ పోస్టుల్లో నియమించే అవకాశాలున్నాయి. ఇలాంటి అంశాలన్నీ ఆర్‌ఓఆర్ బిల్లులో ఉన్నాయి. ఈ కొత్త బిల్లులు కాకుండా మరో ఐదు ఆర్డినెన్స్‌లను సభలో ప్రవేశపెట్టి ఆమోదించనుంది.
వీటిపైనే చర్చ
ఈ సమావేశాల్లో రైతు భరోసా పథకంపై కీలక చర్చ జరగనుంది. దీని విధివిధానాలపై ఇప్పటికే ప్రభుత్వం ఒక ముసాయిదాను తయారు చేసింది. రైతు భరోసా సహాయాన్ని ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలి, ఎలాంటి భూములకు ఇవ్వాలి, కౌలు రైతుల సంగతి ఏమిటి వంటి అంశాలపై చర్చించనున్నారని సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది పూర్తి..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తైన నేపథ్యంలో.. ఈ అసెంబ్లీ సమావేశాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళణ, రైతు భరోసా వంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం.. గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కేసులు, లగచర్ల ఘటన, రైతు భరోసా, బోనస్ వంటి అంశాలపై చర్చకు పట్టుపట్టే అవకాశం కనిపిస్తోంది. వీటన్నింటికంటే మరో ముఖ్యమైన అంశం ఈ సమావేశాల్లో మరింత ఉత్కంఠ రేపనుంది.
కేసీఆర్ వస్తారా..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారి మాత్రమే అది కూడా ఒక్క రోజు మాత్రమే ప్రతిపక్షనేత కేసీఆర్ సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీకి హాజరైన కేసీఆర్.. ఆ రోజు సమావేశం ముగియక ముందే వెళ్లిపోయారు. ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా.. లేదా.. అనేది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ప్రభుత్వ పెద్దల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందనేది మరింత ఆసక్తికరంగా మారింది.
సర్పంచ్ ఎన్నికలు అప్పుడే..
డిసెంబర్ 7వ తేదీతో రేవంత్ సర్కార్ ఏడాది కాలం పూర్తి చేసుకుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిసింది. మరోవైపు పంచాయతీ ఎన్నికలపై కూడా గవర్నమెంట్ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాలని భావిస్తోందట.
పెన్షన్ పెంపుపై నిర్ణయం..
పంచాయతీ ఎన్నికలకు ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచేందుకు రేవంత్ సర్కారు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎలక్షన్స్‌కు ముందు పెన్షన్, రైతు భరోసాను పెంచితే ప్రభుత్వానికి మంచి పేరుతో పాటు పార్టీకి మైలేజీ వస్తుందని భావిస్తున్నారట. అసెంబ్లీ సమావేశాలు, పంచాయతీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్.. ఇంకోవైపు ప్రతిపక్షాలను కూడా టార్గెట్ చేయాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే కొండపోచమ్మ సాగర్ దగ్గరలోని మాజీ మంత్రి హరీష్‌రావు ఫామ్‌హౌస్‌పై విచారణ జరిపించాలని డిసైడ్ అయ్యారట.పెన్షన్ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.