Share News

TG News: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ప్రాజెక్టులన్నీ..

ABN , Publish Date - Aug 23 , 2024 | 08:40 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ప్రత్యేక మిషన్ చేపట్టింది. స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ(స్పీడ్) పేరుతో కొత్త కార్యాచరణ రూపొందించింది.

TG News: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ప్రాజెక్టులన్నీ..
Telangana state government

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ప్రత్యేక మిషన్ చేపట్టింది. స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ(స్పీడ్) పేరుతో కొత్త కార్యాచరణ రూపొందించింది. తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 19ప్రాజెక్టులు, పనులను స్పీడ్ పరిధిలోకి తెచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని స్వయంగా పర్యవేక్షిస్తారు. పనుల తీరు, పురోగతిపై సంబంధిత విభాగాల అధికారులతో నెలకోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ పనులన్నింటినీ నిర్ణీత వ్యవధిలో సమర్థవంతంగా పూర్తి చేయాలనేది స్పీడ్ ప్రధాన లక్ష్యం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రామాణికమైన మౌలిక సదుపాయాల కల్పనలో వివిధ విభాగాల మధ్య ఉన్న అడ్డంకులు, అవరోధాలు అధిగమించేందుకు స్పీడ్ ప్రత్యేక చొరవ తీసుకోనుంది.


స్పీడ్ కింద చేర్చిన పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి నెలకోసారి సమీక్ష నిర్వహిస్తారు. దీని వల్ల ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలో అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుంది. పట్టణాలు సహా అన్ని ప్రాంతాల్లోని అభివృద్ధి పనులపై స్పీడ్ దృష్టి కేంద్రీకరిస్తుంది. స్పీడ్ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఆయా విభాగాలు ప్రత్యేక విధానం అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రమం తప్పకుండా పనితీరు సమీక్షించుకుని పర్యవేక్షణకు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.


ఈ కార్యక్రమంలో భాగంగా తమ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులు, పనులపై సంబంధిత విభాగాలు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తాయి. స్పీడ్ ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ప్రణాళిక విభాగం ఆన్ లైన్ పోర్టల్ రూపొందిస్తుంది. ఏ రోజుకు ఎంత పని జరిగిందనే అప్ డేట్ డేటాను అందులో పొందుపరచాలి. ఏ గడువులోగా ఎంత పని జరుగుతుందనే నిర్ణీత కాల వ్యవధిని ఆయా విభాగాలు ఆన్ పైన్ పోర్టల్లో అప్డేట్ చేయాలి. ఎప్పటివరకు ఏఏ పనులు పూర్తవుతాయనే అంచనాలను సైతం పోర్టల్‌లో ఉంచాలి.


స్పీడ్ ప్రోగ్రామ్‌లోని 19 ప్రాజెక్టులు ఇవే..

  • మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్

  • శాటిలైట్ టౌన్ల అభివృద్ధి

  • మెట్రో రైలు విస్తరణ

  • జీహెచ్ఎంసీ పునర్ వ్యవస్థీకరణ

  • రీజినల్ రింగ్ రోడ్

  • హైదరాబాద్ సిటీలో ఎలివేటెడ్ కారిడార్లు

  • రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు

  • ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం

  • మహిళా శక్తి పథకం అమలు

  • జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణం

  • రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌లు

  • అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల సంస్థాగత అభివృద్ధి

  • ఐటీఐలలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు

  • కొత్త ఉస్మానియా హాస్పిటల్

  • 15 కొత్త నర్సింగ్, 28 కొత్త పారా మెడికల్ కాలేజీలు

  • హెల్త్ టూరిజం ప్రమోషన్

  • ఎకో టూరిజం ప్రాజెక్టుల ప్రమోషన్

  • టెంపుల్ సర్క్యూట్స్ టూరిజం

  • యాంటీ డ్రగ్స్ స్ట్రాటజీ అమలు

Updated Date - Aug 23 , 2024 | 08:58 PM