TG News: పురాతన మెట్ల బావులకు మహర్దశ.. రాష్ట్ర పర్యాటక శాఖ ఒప్పందం..
ABN , Publish Date - Sep 27 , 2024 | 06:44 PM
ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్ధరణకు ఇన్ఫోసిస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. మంచిరేవుల మెట్ల బావిని సాయి లైఫ్ సంస్థ దత్తత తీసుకుంది. సాలార్ జంగ్, అమ్మపల్లి బావులను పునరుద్ధరించడానికి భారత్ బయోటెక్ ముందుకొచ్చింది.
హైదరాబాద్: నగరంలో పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పురాతన కట్టడాలు కాపాడడమే లక్ష్యంగా సీఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ కీలక ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా పురాతన బావులు దత్తత తీసుకునేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకొచ్చాయి. ఇకపై పురాతన బావులను ప్రక్షాళన చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు వారు చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వారికి ఒప్పంద పత్రాలు అందజేశారు.
పునరుద్ధరించే బావులు ఇవే..
ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్ధరణకు ఇన్ఫోసిస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. మంచిరేవుల మెట్ల బావిని సాయి లైఫ్ సంస్థ దత్తత తీసుకుంది. సాలార్ జంగ్, అమ్మపల్లి బావులను పునరుద్ధరించడానికి భారత్ బయోటెక్ ముందుకొచ్చింది. అలాగే అడిక్‌మెట్ మెట్ల బావిని దొడ్ల డైరీ, ఫలక్‌నుమా మెట్ల బావిని టీజీ ఆర్టీసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోఠి ఉమెన్స్ కాలేజీలు దత్తత తీసుకున్నాయి. పురాతన మెట్ల బావులకు పూర్వం వైభవం తీసుకువచ్చి, పర్యాటకులు వచ్చే విధంగా వాటిని తయారు చేయనున్నారు.
చారిత్రక కట్టడాలు రక్షిస్తాం..
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.." మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ సంస్కృతి ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా నగరంలోని అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నాం. త్వరలోనే అందులో శాసన మండలి ఏర్పాటు చేస్తాం. ఉస్మానియా ఆస్పత్రి భవనాన్నీ పరిరక్షిస్తాం. ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ స్టేడియానికి తరలిస్తాం. హైదరాబాద్ సిటీ కాలేజ్, పురానాపూల్ బ్రిడ్జి, హైకోర్టు భవనం, జూబ్లిహాల్ వంటి చారిత్రక కట్టడాలను రక్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోంది" అని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
R.P.Patnayak: రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఆర్పీ పట్నాయక్ ఫిర్యాదు.. విషయం ఏంటంటే..
Flight Services: శ్రీ రాముడి భక్తులకు అదిరిపోయే వార్త
Hyderabad: జీహెచ్ఎంసీ మరో సంచలన నిర్ణయం..