Share News

TG Politics:తెలంగాణలో పొలిటికల్ హీట్.. కేటీఆర్ జనంలోకా.. జైల్లోకా.. బీఆర్‌ఎస్ కట్టడికి కాంగ్రెస్ ప్లాన్ అదేనా

ABN , Publish Date - Nov 02 , 2024 | 09:20 PM

గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంటే.. కొత్త సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమని కేటీఆర్ మనసులో మాటను బయటపెట్టారు. మరోవైపు తెలంగాణలో బాంబులు పేలతాయంటూ మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. మరోవైపు హైదరాబాద్ నుంచి వాడపల్లికి..

TG Politics:తెలంగాణలో పొలిటికల్ హీట్.. కేటీఆర్ జనంలోకా.. జైల్లోకా.. బీఆర్‌ఎస్ కట్టడికి కాంగ్రెస్ ప్లాన్ అదేనా
BRS vs Congress

తెలంగాణలో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంటే.. కొత్త సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమని కేటీఆర్ మనసులో మాటను బయటపెట్టారు. మరోవైపు తెలంగాణలో బాంబులు పేలతాయంటూ మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. మరోవైపు హైదరాబాద్ నుంచి వాడపల్లికి సెక్యూరిటీ లేకుండా పాదయాత్రకు సిద్ధమని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. త్వరలో 6 గ్యారెంటీల ఎగవేతపై నిలదీత యాత్రలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరో వైపు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేసిఆర్, కేటిఆర్, హరీశ్ రావు టార్గెట్‌గా ఇప్పటికే విద్యుత్తు అవకతవకల అంశంలో కేసిఆర్‌కు నోటీసులు జారీచేశారు. అలాగే జస్టిస్ మదన్ భీంరావు లోకూర్ కమిషన్ విద్యుత్తు అవకతవకలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీంతో తదుపరి చర్యల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమీషన్ విచారణ దాదాపుగా పూర్తికాగా.. రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.


కేసీఆర్, హారీశ్‌కు నోటీసులు..

మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావుకు జస్టిస్ ఘోష్ కమిటీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణకు ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ సమగ్రంగా దర్యాప్తు జరిపి నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఫార్ములా ఈ- రేస్‌లో నిబంధనలు పాటించలేదని ప్రాధమికంగా ప్రభుత్వం నిర్ధారణకు రావడంతో ఏసిబి దర్యాప్తునకు ప్రభుత్వం అనుమతించింది. జాయింట్ డైరెక్టర్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక సిట్ ఏర్పాటుచేసింది. వచ్చే వారం నుంచి విచారణను సిట్ ప్రారంభించనుంది. ఫార్ములా వన్ ఈ-రేస్‌ కేసులో కేటీఆర్, ఐఎఎస్ అర్వింద్ కుమార్ సహా పలువురికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

ఓవైపు పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్దామని ప్లాన్ చేస్తున్న కేటీఆర్‌కు రేవంత్ సర్కార్ ఊహించని షాక్ ఇస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఈ ఏడాదిలోనే కేటీఆర్‌ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేటీఆర్ పాదయాత్ర చేస్తానని ప్రకటించడంతో.. ప్రస్తుతం ఆయనను అరెస్ట్ చేస్తే ప్రజల్లో మరింత సానుభూతి లభించే అవకాశం ఉండొచ్చనే ఆలోచనలోనూ ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలోని అక్రమాలు, అవకతవకలపై మంత్రివర్గంలో, శాసనసభలో చర్చించిన తర్వాతత కేసీఆర్‌తో పాటు ఇతర పాత్రదారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో నవంబర్‌లో పొలిటికల్ దీపావళి బాంబులు పేలతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈనెలలో ఎలాంటి బాంబులు పేలతాయనే ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 02 , 2024 | 09:23 PM