Kakatiya University: కుప్పకూలిన హాస్టల్ స్లాబ్ పెచ్చులు..
ABN , Publish Date - Jul 14 , 2024 | 03:04 AM
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని పోతన హాస్టల్‌లో మరో దారుణం జరిగింది. జూన్ 28న ఇదే హాస్టల్‌లో ఓ విద్యార్థిని తలపై సీలింగ్ ఫ్యాన్ పడి తీవ్ర గాయమైన ఘటనను మరువక ముందే.. శుక్రవారం రాత్రి హాస్టల్ మూడో అంతస్థులోని రూం నం.94లో శ్లాబ్ పెచ్చులు ఊడి పడ్డాయి.
కేయూ విద్యార్థినుల వసతి గృహంలో దారుణం
పరిశీలించిన రిజిస్ట్రార్.. అదే గదిలో దిగ్బంధం
వెంటనే కొత్త హాస్టల్‌కు విద్యార్థినుల తరలింపు
కేయూ క్యాంపస్, జూలై 13 : వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని పోతన హాస్టల్‌లో మరో దారుణం జరిగింది. జూన్ 28న ఇదే హాస్టల్‌లో ఓ విద్యార్థిని తలపై సీలింగ్ ఫ్యాన్ పడి తీవ్ర గాయమైన ఘటనను మరువక ముందే.. శుక్రవారం రాత్రి హాస్టల్ మూడో అంతస్థులోని రూం నం.94లో శ్లాబ్ పెచ్చులు ఊడి పడ్డాయి. దీంతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఆ సమయంలో గదిలో ఉన్న వారంతా మరో పక్కన కూర్చోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకుని హాస్టల్‌ను పరిశీలించేందుకు వచ్చిన రిజిస్ట్రార్ మల్లారెడ్డి, హాస్టల్ డైరెక్టర్ రాజ్‌కుమార్‌ను విద్యార్థులు పెచ్చులూడిన గదిలో దిగ్బంధించారు.
తమకు హాస్టల్‌లో ప్రాణ భయం ఉందని, తాము అక్కడ ఉండలేమని వాగ్వాదానికి దిగారు. శనివారం తెల్లవారుఝామున విద్యార్థినులకు మద్దతుగా విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. దాంతో దిగొచ్చిన అధికారులు క్యాంప్‌సలోని శ్రీ సమ్మక్క-సారలమ్మ హాస్టల్‌కు విద్యార్థినులను పంపించేందుకు అంగీకరించారు. పోతన హాస్టల్‌లోని విద్యార్థినుల బెడ్లు, ఇతర సామగ్రిని కొత్త హాస్టల్‌కు తరలించారు. అయి తే నూతన హాస్టల్‌లో వాచ్‌రూంలు, ఇతర సదుపాయాలు సక్రమంగా లేవని విద్యార్థులు అధికారులతో గొడవకు దిగారు. దాంతో హుటాహుటిన ఫెన్సింగ్‌తో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు.