Share News

Police Medal: ఇద్దరు రైల్వే ఏఎస్సైలకు ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

ABN , Publish Date - Aug 15 , 2024 | 03:00 AM

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వేలోని ఇద్దరు పోలీసులకు ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ లభించింది.

Police Medal: ఇద్దరు రైల్వే ఏఎస్సైలకు ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వేలోని ఇద్దరు పోలీసులకు ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ లభించింది. రైల్వేలో అత్యుత్తమ ప్రతిభావంతమైన సేవలకుగాను కామారెడ్డి ఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ జె.సుధాకర్‌, విజయవాడ డివిజన్‌లో ఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ నయీం బాషా షేక్‌ (అనలిటికల్‌ డేటా మేనేజ్‌మెంట్‌ సెల్‌)లు పోలీస్‌ మెడల్‌కు ఎంపికైనట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం తెలిపారు.


కామారెడ్డి ఔట్‌పోస్టులో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్‌ రైల్వేకు సంబంధించిన పలు దొంగతనం కేసులను విజయవంతంగా పరిష్కారించారు. 2018 సంవత్సరంలో హరియాణా దొంగల ముఠాను చాకచక్యంగా అరెస్టు చేసి అపహరించిన సొమ్మును రికవరీ చేశారు. 2019-20లో 14 టీవోపీబీ నేరాల్లో 23.2 తులాల బంగారం, 6 ల్యాప్‌టా్‌పలతో సహా రూ.12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.


రైల్వే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద 393 మంది నేరస్థులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించారు. విజయవాడ డివిజన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న షేక్‌ నయీం బాషా 1995లో రైల్వే రక్షణ దళంలో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. ఆర్‌పీఎఫ్‌ నియామక కమిటీలో, పదోన్నతి కల్పించే కమిటీల్లో పని చేస్తూ ప్రశంసలందుకున్నారు. పోలీస్‌ మెడల్‌కు ఎంపికైన సుధాకర్‌, నయీం బాషాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌ అభినందించారు.

Updated Date - Aug 15 , 2024 | 03:00 AM