Share News

Hyderabad: నిర్వాసితులతో ఒకరోజు ఉండండి!

ABN , Publish Date - Nov 02 , 2024 | 03:45 AM

మూసీ నిర్వాసిత కుటుంబీకులతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెకొలేకర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు గురువారం వినూత్న నిరసన తెలిపారు.

Hyderabad: నిర్వాసితులతో ఒకరోజు ఉండండి!

  • కేటీఆర్‌, హరీశ్‌, ఈటలకు ఆహ్వానిస్తూ వినూత్న నిరసన.. ఇళ్లలో మడత మంచాలు, కుర్చీలు.. బయట వారి ఫ్లెక్సీలు

చాదర్‌ఘాట్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మూసీ నిర్వాసిత కుటుంబీకులతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెకొలేకర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు గురువారం వినూత్న నిరసన తెలిపారు. దీపావళి పండుగ రోజున మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ మూసీ నిర్వాసిత కుటుంబీకులతో ఒకరోజు నివాసం ఉండాలంటూ ముసారాంబాగ్‌ డివిజన్‌లోని శాలివాహననగర్‌ కాలనీ మూసీ పరీవాహక ప్రాంతమైన సాయిలు హట్స్‌లోని ఇళ్లలో మడత మంచాలు, కూర్చీలు ఏర్పాటు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌, ఎంపీ ఈటల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి పూల దండలు, బోకేలతో స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేశారు.


మూసీనదిని ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినప్పటి నుంచి నిరుపేద కుటుంబాలపై కేటీఆర్‌, హరీశ్‌, ఈటల, ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెకొలేకర్‌ శ్రీనివాస్‌ ఆరోపించారు. మూసీ నిర్వాసిత కుటుంబీకులు గౌరవంగా బతికేందుకు అవసరమైన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను కేటాయిస్తుంటే చూస్తూ ఓర్వలేకే కేటీఆర్‌, హరీశ్‌ ఈటల.. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టారని విమర్శించారు. మూసీ రివర్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్ట్‌ చేపట్టింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదా? అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ ఇదే తరహాలో అడ్డుకునే ప్రయత్నం చేసిందా? అని వారిని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవనం కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టును చేపడుతుంటే అందుకు సహకరించాల్సింది పోయి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమైన మూసీ గర్భంలో ఉన్న నిరుపేద కుటుంబీకులను ఎందుకు అడ్డుకుంటున్నారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.


  • స్వచ్ఛందంగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం

అయ్యా సారూ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తాము మూసీ గర్భంలో ఉన్న ఇళ్లను ఖాళీ చేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం కేటాయించే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలోకి వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పలువురు మహిళలు స్పష్టం చేశారు. ఇందులో ఏ ఒక్క రాజకీయ నాయకుని నుంచి గానీ, ఏ ఒక్క అధికారి నుంచి గానీ ఒత్తిడి లేదన్నారు. కాగా ముసారాంబాగ్‌ శాలివాహన నగర్‌ కాలనీలో గల సాయిలు హట్స్‌లో ఏర్పాటు చేసిన సీఎం రేవంత్‌ చిత్రపటానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెకొలేకర్‌ శ్రీనివా్‌సతో కలిసి మూసీ నిర్వాసిత కుటుంబీకులు, మహిళలు క్షీరాభిషేకం చేశారు.

Updated Date - Nov 02 , 2024 | 03:45 AM