Share News

Kaleshwaram Project: ‘కాళేశ్వరం’లో మా పాత్రేం లేదు!

ABN , Publish Date - Jul 16 , 2024 | 04:46 AM

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అంచనాల సవరణ, టెండర్ల ప్రక్రియలో తమ పాత్రేమీ లేదని ఐఏఎస్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను మాత్రమే అమలు చేశామని స్పష్టం చేశారు.

Kaleshwaram Project: ‘కాళేశ్వరం’లో  మా పాత్రేం లేదు!

  • ఉన్నతస్థాయి నిర్ణయాలనే అమలు చేశాం

  • జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌కు ఐఏఎస్‌,

  • రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారుల వివరణ

  • మీరు చెప్పినదంతా.. అఫిడవిట్ల

  • రూపంలో సమర్పించండి

  • అధికారులకు సూచించిన కమిషన్‌

  • ఎస్‌కే జోషి, సోమేశ్‌, రామకృష్ణారావు,

  • రజత్‌కుమార్‌, స్మితాసబర్వాల్‌ హాజరు

హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అంచనాల సవరణ, టెండర్ల ప్రక్రియలో తమ పాత్రేమీ లేదని ఐఏఎస్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను మాత్రమే అమలు చేశామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో లోపాలు, అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ఎదుట సోమవారం పలువురు సీనియర్‌ ఐఏఎ్‌సలు, విశ్రాంత ఐఏఎ్‌సలు హాజరయ్యారు. మాజీ సీఎస్‌ శైలేంద్రకుమార్‌ జోషి (ఆన్‌లైన్‌లో), మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ముఖ్యకార్యదర్శి వికా్‌సరాజ్‌, నీటిపారుదల శాఖ ప్రస్తుత కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, మాజీ సీఎం కేసీఆర్‌కు పదేళ్లు కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్‌ విచారణకు హాజరై, వాద నలు వినిపించారు.


బ్యారేజీల నిర్మాణ ప్రాంతాల ఎంపిక, నిర్మాణంలో మీ పాత్ర ఏంటి? అని కమిషన్‌ ఆరా తీసింది. బ్యారేజీల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు, కాంట్రాక్టర్లకు పనులు అప్పగించిన తీరు, వారితో చేసుకున్న ఒప్పందాలు, వాటి అమలు, అంచనాల సవరణ, ఉల్లంఘనలు తదితర అంశాలపై వారిని ప్రశ్నించినట్లు సమాచారం. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించి, ఇప్పటికే సేకరించిన సమాచారం ఆధారంగా ఐఏఎస్‌, మాజీ ఐఏఎస్‌ అధికారులపై కమిషన్‌ ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలపైనా లోతుగా విచారించినట్లు సమాచారం. అంచనా వ్యయ ఆమోదం, పరిపాలనా అనుమతులు, సవరణ అంచనాలు, నిధుల విడుదల, కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు అనుమతులు, దాని ద్వారా రుణాలు సమీకరించిన తీరు తదితర అంశాలపై వారిని ప్రశ్నించినట్లు తెలిసింది.


ఏ నిర్ణయం కూడా తాము తీసుకోలేదని, అన్నీ ఉన్నతస్థాయిలోనే జరిగాయని అధికారులు తెలిపినట్లు సమాచారం. ఉన్నతస్థాయిలో జరిగిన నిర్ణయాలనే అమలు చేశామని, బ్యారేజీల నిర్మాణం, వైఫల్యం, అంచనాల సవరణతో తమకెలాంటి ప్రత్యక్ష సంబంధాల్లేవని వారు వివరించినట్లు తెలిసింది. ఇక కమిషన్‌కు నివేదించిన అంశాలను అఫిడవిట్ల రూపంలో వారంలోగా సమర్పించాలని జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఆదేశించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనల తయారీలో నిమగ్నమై ఉండడంతో ఆయనకు ఆగస్టు 5వరకు గడువు ఇచ్చారు. కాగా, విచారణకు పూర్తి సహకారం అందిస్తామని ఐఏ ఎస్‌లు, మాజీ ఐఏఎ్‌సలు స్పష్టం చేశారు.

Updated Date - Jul 16 , 2024 | 04:46 AM