Green Pharma City: ఫార్మా సిటీ భూసేకరణలో అక్రమాలు!
ABN , Publish Date - Sep 30 , 2024 | 04:10 AM
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ భూసేకరణలో భారీగా అక్రమాలు జరిగాయని, కోట్లాది రూపాయల నిధులు పక్కదారి పట్టినట్లు వచ్చిన ఆరోపణలపై ఇంటెలిజెన్స్, సీఐడీ అధికారులు గోప్యంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
గోప్యంగా ఇంటెలిజెన్స్, సీఐడీ విచారణ
అక్రమార్కుల గుండెల్లో గుబులు
యాచారం, సెప్టెంబరు 29: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ భూసేకరణలో భారీగా అక్రమాలు జరిగాయని, కోట్లాది రూపాయల నిధులు పక్కదారి పట్టినట్లు వచ్చిన ఆరోపణలపై ఇంటెలిజెన్స్, సీఐడీ అధికారులు గోప్యంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఫార్మాసిటీ కోసం ఇప్పటికే 8 వేల ఎకరాల పట్టా, అసైన్డ్ భూములను సేకరించారు. సెంటు భూమి లేని వారికి కూడా వారి ఆధీనంలో భూములు ఉన్నట్టు చూపుతూ పరిహారం ఇచ్చారని, ఇలా పెద్దమొత్తంలో నిధుల దుర్వినియోగం జరిగిందని గుర్తించినట్టు సమాచారం. తాటిపర్తిలో 104 సర్వే నెంబర్‌లో 250 ఎకరాల భూదాన్ భూములున్నాయి.
వీటిపై కోర్టులో కేసులు ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా 168 ఎకరాలకు పరిహారం ఇవ్వడంపైనా సీఐడీ విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కొందరు స్థానికేతరులకు కూడా పరిహారం ఇచ్చారని అధికారుల దృష్టికి వచ్చింది. దీనికి మధ్యవర్తిత్వం వహించిందెవరు? ఎంత ముడుపులు తీసుకున్నారు? అని ఆరా తీస్తున్నారు. యాచారం రెవెన్యూ కార్యాలయంలో పలు రికార్డులను సేకరించినట్లు తెలిసింది. నాయకుల నుంచి రెవెన్యూ అధికారులు భారీగా ముడుపులు అందుకుని స్థానికేతరులకు పరిహారం అందజేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై విచారణ జరుగుతున్నట్లు తెలియడంతో మధ్యవర్తులు గ్రామాలను విడిచి పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు. అవకతవకలపై పక్కాగా విచారణ చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. భూమి లేకున్నా నకిలీ పత్రాలతో ప్రభుత్వ ధనం కాజేసిన వారిని గుర్తించడానికి రిజిస్టర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.