కార్పొరేట్ ఆస్పత్రుల అనుమతులు.. సర్కారు చేతుల్లోకి?
ABN , Publish Date - Oct 30 , 2024 | 03:02 AM
ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రుల అనుమతుల మంజూరు ఇక సర్కారు చేతుల్లోకి వెళ్లనుందా? ఇప్పటిదాకా డీఎంహెచ్‌వోలకే ఉన్న ఆ అధికారానికి కత్తెర పడనుందా? పడకల సంఖ్య ఆధారంగా కొత్త ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులిచ్చే విధానంలో మార్పు రానుందా? అంటే..
ఇప్పటిదాకా డీఎంహెచ్‌వోల వద్దే అధికారం
ఇష్టారాజ్యంగా ఇస్తున్న జిల్లా వైద్యాధికారులు
పడకల సంఖ్యను బట్టి ప్రస్తుతం అనుమతులు
ఆ విధానాన్ని మార్చే ఆలోచనలో రాష్ట్ర సర్కారు
అనుమతుల ఫీజులూ భారీగా పెంచే యోచన
ఉన్నత స్థాయి కమిటీ వేసి అధ్యయనం
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రుల అనుమతుల మంజూరు ఇక సర్కారు చేతుల్లోకి వెళ్లనుందా? ఇప్పటిదాకా డీఎంహెచ్‌వోలకే ఉన్న ఆ అధికారానికి కత్తెర పడనుందా? పడకల సంఖ్య ఆధారంగా కొత్త ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులిచ్చే విధానంలో మార్పు రానుందా? అంటే.. ఈ ప్రశ్నలన్నింటికీ వైద్య ఆరోగ్యశాఖ నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో చిన్నచిన్న క్లినిక్కుల నుంచి 1000 పడకలు ఉండే ఆస్పత్రుల దాకా.. అన్నింటికీ జిల్లా వైద్యాధికారులే (డీఎంహెచ్‌వోలు) అనుమతులు ఇస్తున్నారు. అదీ.. నామమాత్రపు ఫీజులతో! కానీ, ఇప్పుడు సర్కారు ఆ విధానానికి చుక్కపెట్టి.. 50కి మించి పడకలు ఉండే ఆస్పత్రుల అనుమతులు రాష్ట్ర స్థాయిలోనే ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. అంటే.. జిల్లా రిజస్ట్రేషన్ అథారిటీకి బదులు స్టేట్ రిజిస్ట్రేషన్ అథారిటీనే ఆ బాధ్యతలు చేపట్టనుంది. కనీస సౌకర్యాలు లేని, భద్రతాప్రమాణాలు పాటించని ఆస్పత్రులకు.. మరీ ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వైద్యాధికారులు ప్రైవేటు ఆస్పత్రులకు ఎడాపెడా అనుమతులు ఇచ్చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు ఆస్పత్రుల అనుమతులకు సంబంధించి ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి, అధ్యయనం అనంతరం ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది.
ఫీజుల పెంపు..
కొత్తగా ఏర్పాటయ్యే ప్రైవేటు ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచాలని సర్కారు భావిస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. 200కు మించి పడకలు ఉండే కార్పొరేట్ ఆస్పత్రికి కూడా ఈ ఫీజు కేవలం రూ.16 వేలుగా ఉంది. ఫలితంగా.. రూ.వందల కోట్లతో కట్టే కార్పోరేట్ ప్రైవేటు ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో తగినంత ఆదాయం రావడం లేదన్న అభిప్రాయంతో ఉన్న వైద్య, ఆరోగ్య శాఖ.. బడా కార్పోరేట్ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ చార్జీలను అదే స్థాయిలో పెంచాలనే ఉద్దేశంతో ఉంది. ఈమేరకు రిజిస్ట్రేషన్ ఫీజులను చట్ట ప్రకారం సవరించడానికి సంబంఽధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్యశాఖ ఉన్నతాఽధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.
ఇదీ ప్రస్తుత విధానం
ప్రస్తుత విధానం ప్రకారం.. ఎవరైనా కొత్తగా ప్రైవేటు ఆస్పత్రి పెట్టాలనుకుంటే సంబంధిత జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ నుంచి కచ్చితంగా అనుమతులు పొందాలి. జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ (డీఆర్‌ఏ) జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) నియంత్రణలో ఉంటుంది. వీరి ఆధ్వర్యంలోని కమిటీనే కొత్త ఆస్పత్రులకు క్లినికల్ ఎస్టాబ్లి్‌షమెంట్ యాక్ట్ (సీఈఏ) నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేస్తారు. ఆ సమయంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అది ఏ ప్రాంతంలో ఉందో పరిశీలించి, పడకల సంఖ్య ఆధారంగా రిజిస్ట్రేషన్ ఫీజును నిర్థారిస్తారు. ఒక్కసారి అనుమతినిస్తే.. ఐదేళ్ల వరకూ అది కొనసాగతుంది. ఆనంతరం మళ్లీ రెన్యువల్ చేసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్, సొసైటీ, స్థానిక సంస్థల, సింగిల్ డాక్టర్ వైద్యశాలలన్నీ జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ పరిధిలోకి వస్తాయి. అలాగే ప్రైవేటు ఆస్పత్రులు విధిగా ప్రతి నెలా తమ ఆస్పత్రుల్లో చిక్సిత పొందే రోగుల రికార్డులను వైద్య ఆరోగ్యశాఖకు పంపాలి. ఏదైనా ఆస్పత్రిపై ఫిర్యాదు వస్తే డీఆర్‌ఏ విచారణ జరుపుతుంది.