Share News

Hyderabad: జూనియర్‌ డాక్టర్ల సమ్మె విరమణ..

ABN , Publish Date - Jun 27 , 2024 | 02:52 AM

జూనియర్‌ డాక్టర్లు సమ్మె విరమించారు. గురువారం నుంచి యథావిఽధిగా విధులకు హాజరు కానున్నారు. ఈ విషయాన్ని జూడాలు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమక్షంలో ప్రకటించారు. దీంతో రెండురోజులుగా జూడాలు చేస్తున్న ఆందోళనకు తెరపడింది.

Hyderabad: జూనియర్‌ డాక్టర్ల సమ్మె విరమణ..

  • నేటి నుంచి విధుల్లోకి..

  • మంత్రి సమక్షంలో జూడాల ప్రకటన.. వారి సమస్యలను పరిష్కరించాం

  • రెండ్రోజుల్లో రూ.610 కోట్లు విడుదల చేశాం.. ఉస్మానియా కొత్త భవనాన్నీ నిర్మిస్తాం

  • ఫుడ్‌, డ్రగ్స్‌ ల్యాబ్‌లను బలోపేతం చేస్తాం.. వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): జూనియర్‌ డాక్టర్లు సమ్మె విరమించారు. గురువారం నుంచి యథావిఽధిగా విధులకు హాజరు కానున్నారు. ఈ విషయాన్ని జూడాలు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమక్షంలో ప్రకటించారు. దీంతో రెండురోజులుగా జూడాలు చేస్తున్న ఆందోళనకు తెరపడింది. తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల ఇబ్బందులను వెంటనే పరిష్కరించామని మంత్రి దామోదర వెల్లడించారు. ఆయన జూడాలతో కలిసి మీడియాతో మాట్లాడారు. జూడాలు గతంలో రెండు సార్లు స్టైపెండ్‌ గురించి తమ దృష్టికి తెచ్చారన్నారు. ప్రతిసారి స్టైపెండ్‌ సమస్య ఎదురవుతున్నట్లు చెప్పారని, గ్రీన్‌ చానల్‌ ద్వారా చెల్లించాలని, అలాగే మెడికల్‌ కాలేజీల్లో వసతి భవనాలు ఏర్పాటు చేయాలని కోరారని తెలిపారు. వైద్యులకు రక్షణ కావాలని అభ్యర్థించారని మంత్రి చెప్పారు. వారితో జరిగిన చర్చలు ఫలించాయన్నారు.


జూడాల స్టైపెండ్‌ కోసం రూ.406 కోట్లు విడుదల చేశామని తెలిపారు. గాంధీ, ఉస్మానియాలో హాస్టళ్లు నిర్మించాలని కోరడంతో అక్కడికి అఽధికారులను పంపగా.. వారు హాస్టళ్లు నిర్మించాల్సిన అవసరం ఉందని తేల్చారని చెప్పారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీ హాస్టళ్లు, రోడ్డు నిర్మాణం, మరమత్తులకు రూ.121 కోట్లు కేటాయించామని వెల్లడించారు. అలాగే గాంధీ మెడికల్‌ కాలేజీకి రూ.79 కోట్లు, కాకతీయ మెడికల్‌ కాలేజీలో రహదారుల పునరుద్ధరణకు రూ.3.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కేవలం రెండు రోజుల్లోనే జూడాల సమస్యలకు సంబంధించి రూ.610 కోట్లు విడుదల చేశామన్నారు. వెంటనే స్పందించి, నిధులు విడుదల చేసినందుకు సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.


ఇక ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవన నిర్మాణ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. అక్కడ కొత్త భవన నిర్మాణానికి తాము సానుకూలంగా ఉన్నామని చెప్పారు. త్వరలోనే సంచార ఆహార ప్రయోగశాల (మొబైల్‌ ఫుడ్‌ ల్యాబ్స్‌)ల సంఖ్యను పెంచుతామని.. ఫుడ్‌, డ్రగ్‌ ల్యాబ్‌లను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తూ, ప్రైవేటు ఆస్పత్రులను జవాబుదారీతనంతో వ్యవహరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.. ఇక ఇదే మీడియా సమావేశంలో పాల్గొన్న జూడాల ప్రతినిధులు తాము సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటిస్తూ, గురువారం నుంచి విధులకు హాజరవుతామని చెప్పారు. అలాగే ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి దామోదరకు శాలువా కప్పి సన్మానించారు.

Updated Date - Jun 27 , 2024 | 02:52 AM