Supreme Court: జస్టిస్ పీసీ ఘోష్‌కు ఫైళ్లే కాదు..జీతమూ ఇస్తలేరు
ABN , Publish Date - Aug 08 , 2024 | 03:44 AM
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘో్‌షకు మూడు నెలలుగా జీతం చేతికి రాలేదు. ఆయన జీతభత్యాల ఫైలు ఆర్థిక శాఖలో ఆగిపోవడమే దీనికి కారణం.
మూణ్నెల్లుగా ఆర్థికశాఖ వద్దే ఆగిన ఫైలు
హైదరాబాద్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘో్‌షకు మూడు నెలలుగా జీతం చేతికి రాలేదు. ఆయన జీతభత్యాల ఫైలు ఆర్థిక శాఖలో ఆగిపోవడమే దీనికి కారణం. విచారణ విధివిధానాల కోసం జీవో ఇచ్చిన ప్రభుత్వం.. ఆయన జీతభత్యాలకు సంబంధించి కూడా మరో జీవోను జారీచేయాల్సి ఉంది. ఆ జీవో ఆధారంగా జీతాల బిల్లును సిద్ధం చేసి, ట్రెజరీకి పంపాలి. అయితే, ఆ జీవో జారీ చేయాలంటే సంబంధిత ఫైలుకు ఆర్థిక శాఖ ఆమోదం లభించాలి. ఆ ఫైలు కొద్దిరోజుల క్రితమే ఆర్థిక శాఖకు చేరినా.. ఆమోదం మాత్రం పొందలేకపోయింది.
కారణాలేవైనాగానీ.. జస్టిస్ పీసీ ఘోష్‌కు మే, జూన్, జూలై నెలల జీతాలు అందలేదు. వెంటపడి అడిగితే తప్ప ఆర్థిక శాఖలో ఏ ఫైలూ ముందుకు కదలదన్న అపప్రథ ఉంది. కానీ, సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ పీసీ ఘోష్.. దాని గురించి అధికారుల వద్ద ఆరా తీయడం తప్ప ఆర్థిక శాఖ వెంటపడలేరు. ఆయన పదవీ కాలం జూన్ 30తో ముగియగా.. మరో రెండు నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అదీ ఆగస్టు నెలాఖరుతో ముగియనుంది. ఆలోగా 3 నెలల జీతం ఆయన చేతికి అందుతుందా? లేదా?.. వేచిచూడాల్సిందే.
ఇదీ నిబంధన..
కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని విచారణ కమిషన్‌కు ఛైర్మన్‌గా నియమిస్తే.. సర్వీసులో ఉండగా అందుకునే మొత్తాన్ని అంటే దాదాపు నెలకు రూ.5.10 లక్షలను వేతనంగా అందించాల్సిన అవసరం ఉంటుంది. పదవీ విరమణ చేసిన తర్వాత ఇవ్వాల్సిన జీతంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చినా ఆర్థిక శాఖ మాత్రం పెండింగ్‌లో పెట్టడం గమనార్హం. కాగా.. విచారణ ప్రారంభమైన నాటినుంచి కూడా అధికారుల తీరుపై జస్టిస్ పీసీ ఘోష్ ఆగ్రహంతోనే ఉన్నారు. విచారణకు సహకరించట్లేదని.. కోరిన ఫైళ్లు ఇవ్వకుండా దాస్తున్నారని ఆయన గుర్తించారు.
ఓ దశలో నీటిపారుదల శాఖ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ‘ఫైళ్లు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంటే... విచారణ బాధ్యతలు ఎందుకు అప్పగించారు’ అంటూ మండిపడ్డారు. విచారణకు హాజరైన వారంతా కోటరీగా ఏర్పడి, వాస్తవ సమాచారం కాకుండా ఎంచుకున్న సమాచారమే అందించారని కూడా ఆయన గుర్తించారు. ఇక కమిషన్‌కు సహాయంగా వేసిన నిపుణుల కమిటీ కూడా.. తాము కోరిన సమాచారం శాఖ అందించలేదని కమిషన్‌కు నివేదించిన సంగతి తెలిసిందే.