Bandi Sanjay: కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఆగ్రహం
ABN , Publish Date - Jan 11 , 2024 | 01:52 PM
కరీంనగర్: తెలంగాణ కోసం కేసీఆర్ రక్తం చిందించారన్న మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఒంట్లో ఉన్నదంతా మద్యమేనని.. రక్తం కాదని.. ప్రజల రక్తాన్ని పీల్చుకు తిన్న రాబందు కేసీఆర్ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
కరీంనగర్: తెలంగాణ కోసం కేసీఆర్ రక్తం చిందించారన్న మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఒంట్లో ఉన్నదంతా మద్యమేనని.. రక్తం కాదని.. ప్రజల రక్తాన్ని పీల్చుకు తిన్న రాబందు కేసీఆర్ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. సమస్యలపై పోరాటం చేసిన వారిని రక్తం కారేలా కొట్టలేదా? అని ప్రశ్నించారు. ప్రజలను దోచుకుతిన్న విషయాన్ని మర్చిపోయి కేటీఆర్ మాట్లాడుతున్నారని, కేసీఆర్ కుటుంబం దోచుకోని రంగం ఏదైనా ఉందా? అని నిలదీశారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేటీఆర్‌ను బొక్కలో వేసేవాళ్లమన్నారు. కేసీఆర్ కొడుకు..ఇంకా అధికారంలోనే ఉన్నామని అనుకుంటున్నారని, కేటీఆర్ అహం ఇంకా దిగలేదని బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నిన్న కేటీఆర్ వ్యాఖ్యలు..
గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్ కష్టపడినంతగా దేశంలో ఎవరూ కష్టపడలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించి, చెమటను ధార పోశారని చెప్పారు. రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో 99 శాతం సమయాన్ని పాలనకే కేటాయించారని తెలిపారు. అధికారంలో ఉన్నపుడు పాలనపై పూర్తిగా దృష్టిపెట్టడంతో పార్టీకి తక్కువ సమయం కేటాయించాల్సి వచ్చిందన్నారు. ఇకపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకుని పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తామని చెప్పారు. పార్టీని ఏక తాటిపైకి తెచ్చేందుకు నాయకులు, ముఖ్య కార్యకర్తలకు త్వరలోనే శిక్షణ తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు. పార్టీ శ్రేణులు ఎవరైనా తెలంగాణ భవన్‌కు రావొచ్చని, తనతోపాటు సీనియర్ నాయకులు అందుబాటులో ఉంటారని తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్‌లో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో బీఆర్‌ఎస్ సీనియర్ నేతలు పోచారం శ్రీనివా్‌సరెడ్డి, మధుసూదనాచారి, కడియం శ్రీహరి, బండ ప్రకాశ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇద్దామనుకున్నాం. వారేమో ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు గవర్నర్ ప్రసంగం, శ్వేత పత్రాల ద్వారా కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం మొదలు పెట్టారు. అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తాం. ప్రజలను వంచించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి అసలు సినిమా ముందుంది’’ అని కేటీఆర్ అన్నారు.
లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీ బలోపేతం..
ఎన్నికల వరకు ప్రజలు తమతోనే ఉన్నారనే ధీమాలో ఉన్నామని, ఉద్యమాల గడ్డ అయిన వరంగల్ జిల్లాలోనూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే బీఆర్‌ఎస్ నేతలు ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందని కేటీఆర్ అన్నారు. జయశంకర్ సార్ పుట్టిన నేల అయిన వరంగల్‌లో 2014, 2019లో ఎంపీ సీటును బీఆర్‌ఎస్ గెలిచిందని, ఈసారి కూడా గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. లోపాలను సమీక్షించుకుని, పార్లమెంటు ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదని, 420 హామీలనే విషయాన్ని కార్యకర్తలు ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను రాజకీయ అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తోందని, వాటిపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంటోందని చెప్పారు. పేదల గొంతుకకు బీఆర్‌ఎస్ అండగా ఉండాలన్నారు. జిల్లాలను రద్దు చేస్తామని సీఎం రేవంత్ అవగాహన లేకుండా చెబుతున్నారని, అలా చేస్తే ప్రజలు ఊరుకోరని అన్నారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత మొదలైందని కేటీఆర్ వెల్లడించారు.
కేసులకు భయపడొద్దు..
అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ తప్పుడు కేసులు పెడుతోందని, వాటికి భయపడాల్సిన పని లేదని, బీఆర్‌ఎ్‌సకు పటిష్ఠమైన లీగల్ సెల్ ఉందని నాయకులు, కార్యక్తలకు కేటీఆర్ తెలిపారు. కేసులు పెడితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు సకాలంలో స్పందించి పోరాడాలన్నారు. కేసుల తీవ్రతను బట్టి రాష్ట్ర నాయకత్వం స్పందిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్‌ను ఉఫ్‌మని ఊదేస్తామని కొందరు నాయకులు అంటున్నారని.. 29 ఏళ్లుగా ఎంతో మంది అలా ప్రయత్నించి విఫలమయ్యారని చెప్పారు. బీఆర్‌ఎస్‌లో ఆర్‌ఎస్ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యూ వరకు అందరూ ఉన్నారని, ఈ పార్టీని లేకుండా చేయడం ఎవరి తరం కాదని కేటీఆర్ అన్నారు.