Warangal: కోచ్ ఫ్యాక్టరీ.. తూచ్
ABN , Publish Date - Aug 05 , 2024 | 04:30 AM
ఉమ్మడి వరంగల్ వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ ఏర్పాటు కలగానే మిగులుతున్నాయి. 55 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు, ఉద్యోగులు కోచ్ ఫ్యాక్టరీ కోసం ఆందోళనలు చేస్తున్నా ఫలితం లేదు.
విభజన హామీపై మాట మార్చిన కేంద్రం
కలగానే కాజీపేటలో బోగీ పరిశ్రమ
వ్యాగన్ కార్ఖానా మంజూరుతోనే సరి
వరంగల్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి వరంగల్ వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ ఏర్పాటు కలగానే మిగులుతున్నాయి. 55 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు, ఉద్యోగులు కోచ్ ఫ్యాక్టరీ కోసం ఆందోళనలు చేస్తున్నా ఫలితం లేదు. 2014లో ఏపీ విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై హమీ ఇచ్చిన కేంద్రం, 2023లో వ్యాగన్ తయారీ పరిశ్రమను ప్రకటించి చేతులు దులుపుకుంది. వేలాది మందికి ఉపాధి కల్పించే కోచ్ ఫ్యాక్టరీ రాకపోవడంతో స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మరోవైపు దక్షిణ భారతదేశానికి గేట్‌వేగా ఉన్న కాజీపేట జంక్షన్‌ను డివిజన్‌గా చేయాలనే డిమాండ్‌ను సైతం కేంద్రం పరిగణనలోకి తీసుకోవటంలేదు. ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలపడంతో పాటు బొగ్గు రవాణాలో కీలకంగా ఉన్న కాజీపేట జంక్షన్‌ను డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది.
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ.. ఇక్కడి ప్రజల ఎన్నో ఏళ్ల కల. 2014లో రాష్ట్ర విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని కేంద్రం హమీ ఇచ్చింది. ఇందు కోసం గత ప్రభుత్వం 150 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అయితే 2017లో దేశంలో ఎక్కడ కూడా కోచ్ ఫ్యాక్టరీల అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి విరుద్ధంగా2018 ఏప్రిల్‌లో మహారాష్ట్రలోని లాతూర్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు రూ.625కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఒత్తిడి పెరగటంతో 2023 జూలై 8న కాజీపేటలో 160 ఎకరాల్లో రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమకు ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. 2025లోగా పూర్తయ్యేలా రూ.521కోట్లతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. అయితే కోచ్ ఫ్యాక్టరీతో సుమారు 60వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని.. వ్యాగన్ పరిశ్రమ ద్వారా 2వేల మందికి కూడా ఉపాధి లభించే అవకాశాలు లేవని స్థానికులు పేర్కొంటున్నారు.
డివిజన్‌కు అన్ని అర్హతలు..
ఏపీ నుంచి విడిపోయాక రైల్వే కనెక్టివిటీ తక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మారింది. దీంతో తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళ్లాయి. అయితే ప్రధానంగా దక్షిణ భారతదేశ రైల్వేకు గేట్‌వేగా ఉన్న కాజీపేటను డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కాజీపేట మీదుగా ఉత్తర, మధ్య భారతదేశానికి రైళ్లు నడుస్తున్నాయి. కాజీపేట, వరంగల్ స్టేషన్ల మీదుగా నిత్యం సుమారు 200కు పైగా గూడ్స్, ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. వీటితో పాటు భూపాలపల్లి, గోదావరిఖని, మణుగూరు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో ఉన్న బొగ్గు రవాణా కాజీపేట మీదుగానే జరుగుతోంది. ఎక్కువ ఆదాయం వచ్చే జంక్షన్లలో కాజీపేట ముందంజలో ఉంది.
తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్, సికిందరాబాద్ రైల్వే డివిజన్లు మాత్రమే ఉన్నాయి. ఆ రెండు కార్యాలయాలు ఒకే చోట ఉండటంతో వాటిని వేరుగా చూడటం లేదు. ఇక సికిందరాబాద్ డివిజన్‌కు అతి సమీపంలో ఉండటం వల్లే కాజీపేటకు డివిజన్ ఇవ్వటం కుదరటం లేదని కేంద్రం చెబుతోందని.. అయితే విజయవాడకు కేవలం 30కి.మీ. దూరంలోనే ఉన్న గుంటూరును డివిజన్ చేసినప్పుడు హైదరాబాద్, సికిందరాబాద్‌కు 120కి.మీ. దూరంలో ఉన్న కాజీపేటను డివిజన్ చేయటంలో అభ్యంతరం ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నల్లగొండ జిల్లాలో కొంత భాగం గుంటూరు డివిజన్‌లో, మరికొంత భాగం సికిందరాబాద్‌లో కొనసాగుతోంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కాజీపేట డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక దృష్టి పెట్టి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీతో పాటు రైల్వే డివిజన్ కోసం కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
వ్యాగన్ పరిశ్రమనే అప్‌గ్రేడ్ చేయాలి
కాజీపేటలో ఏర్పాటు చేసిన వ్యాగన్ పరిశ్రమనే అప్‌గ్రేడ్ చేసి కోచ్ ఫ్యాక్టరీగా ఏర్పాటు చేయాలి. కోచ్ ఫ్యాక్టరీతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. దక్షిణ మధ్య రైల్వేలో అధిక అదాయం కాజీపేట నుంచే వస్తోంది. రైల్వే డివిజన్ ఏర్పాటు చేసే అన్ని అర్హతలు కాజీపేటకు ఉన్నాయి. కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ సాధించే వరకు ఉద్యోగ జేఏసీ పోరాటం చేస్తుంది.
- దేవులపల్లి రాఘవేందర్, తెలంగాణ రైల్వే ఉద్యోగుల జేఏసీ చైర్మన్