Share News

Mallu Bhatti Vikramarka: అతి త్వరలో కొత్త విద్యుత్ పాలసీ.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 03 , 2024 | 05:53 PM

రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు 20000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ పాలసీ కోసం విద్యుత్ రంగంలో అపార అనుభవం ఉన్న నిష్ణాతులను, అనుభవజ్ఞుల సలహాలతో ప్రణాళిక సిద్ధం చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

Mallu Bhatti Vikramarka: అతి త్వరలో కొత్త విద్యుత్ పాలసీ.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

యాదాద్రి : కొత్త విద్యుత్ పాలసీని రాష్ట్రంలో అతి త్వరలో తీసుకువస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇవాళ(ఆదివారం) పవర్ ప్లాంట్ రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిబంధనలను అనుసరించి గ్రీన్ ఎనర్జీని అందించేందుకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, పవన విద్యుత్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు.


హుజూర్‌నగర్ నియోజకవర్గం గడ్డిపల్లిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ముందు చెప్పినట్లే 2025మే నాటికి వైటీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపారు. 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్డుకు అనుసంధానం చేస్తామని అన్నారు. తెలంగాణవ్యాప్తంగా గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. అధికారిక అంచనాల ప్రకారం 2028-29 నాటికి 24,488 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.


2034-38 నాటికి 35,800 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి అవసరం ఉంటుందని అన్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు 20000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పాలసీ కోసం విద్యుత్ రంగంలో అపార అనుభవం ఉన్న నిష్ణాతులను, అనుభవజ్ఞుల సలహాలతో ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. శాసనసభలో చర్చలు జరిపి అందరి సహకారంతో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలో రాష్ట్రంలోకి బహుళ జాతి సంస్థలు పెద్ద ఎత్తున తరలి రాబోతున్నాయని తెలిపారు.వాటికి అనుగుణంగా విద్యుత్ అందించేందుకు ముందస్తు ప్రణాళికతో ముందుకు పోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.


ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తాం..

‘‘పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు సంక్షేమ విద్యార్థుల మెస్ చార్జీలకు ఒక్క రూపాయి పెంచలేదు. బడుగు బలహీన వర్గాల కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం. పదేళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఎస్ఎల్‌బీసీ సొరంగంలో ఒక్క కిలోమీటర్ కూడా పనులు చేయలేదు.. 20 నెలల్లో మా ప్రభుత్వంలో ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. భారత దేశంలో ఎక్కడా లేనివిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపడుతున్నాం. మన విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌లో వసతులు కల్పిస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం గత ఏడాది రెసిడెన్షియల్ పాఠశాలలకు రూ. 70 కోట్లు కేటాయించింది.. కానీ మా ప్రభుత్వం ఒకే ఏడాది రూ.5 వేల కోట్లు కేటాయించి నిరుపేద పిల్లలపై మాకున్న చిత్తశుద్ధిని చాటాం. అద్భుతమైన తెలంగాణను ఆవిష్కరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రిమండలి రోజుకు 18 గంటల పాటు పనిచేస్తున్నాం. ఈ రాష్ట్ర సంపద ప్రజలకు ఉపయోగపడాలి కానీ పాలకులు పంచుకోవడానికి కాదు’’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG Politics : రైతులను రోడ్డున పడేసిన రేవంత్ సర్కార్

TG Politics: ‘దౌర్భాగ్య స్థితిలో రేవంత్ సర్కార్’

Minister Jupally: అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత గత పాలకులది..

For Telangana News And Telugu News

Updated Date - Nov 03 , 2024 | 06:01 PM