Bhatti Vikramarka: భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు
ABN , Publish Date - Sep 02 , 2024 | 10:17 PM
ఖమం జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయని తెలిపారు.
ఖమ్మం జిల్లా: ఖమం జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయని.. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి రాష్ట్రంలో అధికారులను అప్రమత్తం చేశారని తెలిపారు. ఈరోజు(సోమవారం) ఖమ్మంలో మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ వర్షాలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చి హెచ్చరించిన రెండు రోజుల్లోనే విపత్కర పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
తాను తన జీవితంలో ఇంతవరకు ఇలాంటి వరద చూడలేదని అన్నారు. వాగులు, నదులు పొంగాయని చెప్పారు. సబ్ స్టేషన్లు మునిగిపోయాయని....విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని చెప్పారు. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. బాధితులకు అండగా నిలిచామని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అధికారులను అభినందిస్తున్నానని.. వారు అందించిన సేవలు మరువలేనివని మంత్రి భట్టి విక్రమార్క ప్రశంసించారు.
మంత్రులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పనిచేయడం చూడలేదని అన్నారు. మంత్రులు, అధికారులు సహాయక చర్యలలో పెద్దఎత్తున పాల్గొన్నారని తెలిపారు. హెలికాఫ్టర్లు రప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేశామని.. వాతావరణం అనుకులించలేదని అన్నారు. ప్రజల కోసం వారి కష్టాల్లో పాలు పంచుకునేందుకు ముఖ్యమంత్రి ఈరోజు ఖమ్మం వచ్చారని తెలిపారు. ముందు తాత్కాలిక ఉపశమనం కోసం అత్యవసర సాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని తెలిపారు. నష్టం అంచనాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. టిట్వర్, సోషల్ మీడియాకు పరిమితమైన కొందరు నేతలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.
నేషనల్ హైవే పనుల కోసం కేంద్రంతో మాట్లాడా: మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి
నిరాశ్రయులైన వారిని చూస్తే బాధ వేసిందని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇది ప్రజా ప్రభుత్వం, అధికారులు అంతా కలిసి పని చేద్దామని సూచించారు. భారీ వర్షాలతో ఉప ద్రవం రావటంతో సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారని అన్నారు. రోడ్లకి సంబంధించిన నిధులు ఇస్తామని తెలిపారు. నేషనల్ హైవే పనుల కోసం కేంద్రంతో మాట్లాడానని చెప్పారు. భారీ వర్షాలతో ముగ్గురు చనిపొతే సీఎం ధైర్యం చెప్పడానికి వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహారిస్తోంది: మంత్రి శ్రీధర్ బాబు
నిర్మల్ : భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా వ్యవహారిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈరోజు(సోమవారం) నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగామంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... వర్షాలపై పరిస్థితిని నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని అన్నారు. నష్టం ఎక్కువగా వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వరదల్లో నష్ట పోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వరద అధికంగా ఉన్న ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లొద్దని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.