MP Raghunandan Rao: ఏపీ మాజీ సీఎం జగన్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు..
ABN , Publish Date - Sep 27 , 2024 | 08:12 PM
తిరుమలకు తాను వెళ్తానంటే బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు. వైసీపీ అధినేతను బీజేపీ నేతలు ఎవ్వరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆయన అన్నారు.
ఖమ్మం: తిరుమలకు తాను వెళ్తానంటే బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు. వైసీపీ అధినేతను బీజేపీ నేతలు ఎవ్వరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆయన అన్నారు. డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సి వస్తుందనే జగన్ తమ పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు జగన్ చేసిన వ్యాఖ్యలకు రఘునందన్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
సంతకం పెట్టలేకే ఆరోపణలు..
ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ... "డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సి వస్తుందనే తిరుమలకు జగన్ వెళ్లలేదు. బీజేపీ నేతలు ఆయణ్ని అడ్డుకోవడానికి చూశారనేది పచ్చి అబద్ధం. డిక్లరేషన్‌పై సంతకం పెట్టలేకే బీజేపీపై ఆయన బురదజల్లుతున్నారు. అన్యమతస్తులు దేవాలయాల్లోకి వెళితే డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలని రాజ్యాంగంలో ఉంది. మసీదులోకి వెళ్తే టోపీ, కర్చీఫ్ పెట్టుకుంటున్నారు. అలాగే హిందూ ఆలయాలకు వస్తే డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలి. 5సార్లు తిరుమలకు వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించినట్లు స్వయంగా జగనే చెప్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లేనప్పుడు తిరుమలకు వైసీపీ అధినేత వెళ్లారు. ఆయన తిరుమలకు రావడంలో ఎలాంటి తప్పూ లేదు. అయితే ఆలయ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి. దానిపై సంతకం పెట్టాలనే హిందూ సమాజం ఆయణ్ని అడిగింది. ఇది ఫ్యాన్ పార్టీ అధినేతకే కాదు.. అందరికీ వర్తిస్తుంది. ప్రతి రోజూ వేల మంది దళితులు తిరుమలకు వెళ్తున్నారు. ఇప్పటివరకూ తిరుమల వద్ద కులం పంచాయితీ లేదు. కానీ ప్రస్తుతం జగన్ ఆ ప్రస్తావన తెస్తున్నారు. డిక్లరేషన్‌పై సంతకం పెడితే పాస్టర్లతోనో లేక విదేశాల నుంచి వచ్చే ఫండ్స్‌కు ఇబ్బంది వస్తుందనో ఏమో ఆయన సంతకం పెట్టలేక తిరుమల పర్యటనపై వెనక్కి తగ్గారు.
మాజీ సీఎంని రానివ్వరా?
మాజీ ముఖ్యమంత్రిని తననే తిరుమలకు రానివ్వడం లేదని, ఇంక దళితుల పరిస్థితి ఏంటని జగన్ అంటున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని తిరుమలకు రానియ్యారా?. ఎవరైనా రానివ్వం అని చెప్పారా?. హిందూ సంఘాలు అడిగింది కేవలం డిక్లరేషన్ మాత్రమే. తిరుమల లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదని, ప్రసాదం తయారీలో పాత విధానమే పాంటించామని జగన్ చెప్తున్నారు. మరి డిక్లరేషన్ అంశం కూడా అంతే కదా?. ఇది ఇప్పుడు కొత్తగా అడగటం లేదు.. ఇది కూడా పాత విధానమే. ఈ విషయాన్ని జగన్ గమనించాలి. అన్యమతస్తులు పవిత్ర తిరుమల ఆలయానికి వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. కేవలం ఇక్కడే కాదు.. చాలా హిందూ ఆలయాల్లో ఈ విధానం ఉంది. దేశంలో చాలా ఆలయాల్లో డిక్లరేషన్ నిబంధన ఉంది. మీరు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఈ విధానం ఉంది. బీజేపీనో, రఘునందన్ రావో దీన్ని తీసుకురాలేదు. శ్రీవారి లడ్డూ తయారీకి టెండర్లు ఏ విధంగా పిలుస్తారో.. అలాగే అన్యమతస్తులు తిరుమలకు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి. దీనిపై సంతకం పెట్టడం ఇష్టం లేకే తనను బీజేపీ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారని జగన్ చెప్తున్నారు. సంతకం పెడితే తన మతం వారికి కోపం వస్తుందనే భయంతోనే తిరుమల పర్యటన జగన్ రద్దు చేసుకున్నారు.
మాకు సంబంధం లేదు..
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఐటీ దాడులు ఇప్పుడు కొత్తగా జరగడం లేదు.. ఎప్పట్నుంచో జరిగేవే. మేము ఐటీ దాడులతో పొంగులేటిని భయపెట్టి బీజేపీలోకి తీసుకోవాలని అనుకోవడం లేదు. అలా అనుకుంటే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలనే మా పార్టీలోకి తీసుకుంటాం. చట్టం ముందు అందరూ సమానమే. ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ల మీద ఐటీ, ఈడీ దాడులు జరుగుతాయి. పొంగులేటి ఇంటి మీద జరిగిన దాడితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. చట్టానికి ఏ పార్టీ అయినా ఒకటే. గతంలో పొంగులేటి కుమారుడి విషయంలోనూ విచారణ జరిగింది" అని అన్నారు.
Also Read:
R.P.Patnayak: రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఆర్పీ పట్నాయక్ ఫిర్యాదు.. విషయం ఏంటంటే..
తిరుమల పర్యటన రద్దు చేసుకున్న వైసీపీ అధినేత
క్లాస్ రూమ్‌లో మమ్మీ సినిమా చూపించిన టీచర్..
తండ్రి, కూతుళ్ల డ్యాన్స్ చూస్తే పరేషాన్
For More Telangana News and Telugu News..