Share News

TG News: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..

ABN , Publish Date - Dec 02 , 2024 | 07:41 AM

ములుగు ఏజన్సీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు మావోయిస్టుల ఎన్‌కౌంటర్.. మరోవైపు సోమవారం నుంచి మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముమ్మరంగా కూంబింగ్‌ చేపట్టారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులను నిలిపివేశారు.

TG News: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..

ములుగు జిల్లా: ఏటూరు నాగారం అడవుల్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ (Encounter)లో ఏడుగురు మావోయిస్టులు మృతి (Seven Maoists killed) చెందారు. ఏటూరునాగారం ఆస్పత్రిలో భద్రపరిచిన మావోయిస్టుల మృత దేహాలకు సోమవారం అధికారులు పోస్ట్ మార్టం (Post mortem) నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే నాలుగు మృతదేహాలను గుర్తించారు. మరో మూడు మృతదేహాలను పోలీసులు గుర్తించాల్సి ఉంది. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తారు. ఎన్ కౌంటర్ బూటకమన్న ఆరోపణల నేపథ్యంలో పోస్ట్ మార్టం నివేదిక కీలకంకానుంది.


ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్..

ములుగు ఏజన్సీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు మావోయిస్టుల ఎన్‌కౌంటర్.. మరోవైపు సోమవారం నుంచి మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముమ్మరంగా కూంబింగ్‌ చేపట్టారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులను నిలిపివేశారు. హిట్‌లిస్టులో ఉన్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. హిట్ లిస్టులో ఉన్న నేతలు అనుమతి లేనిదే అడవుల్లోకి రావొద్దన్న పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

వార్ జోన్‌గా మారిన తెలంగాణ, ఛత్తీస్ గడ్ సరిహద్దు..

మరోవైపు 24 వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించాలని మావోయిస్టు పార్టీ పిలుపు ఇచ్చింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్ గడ్ సరిహద్దు వార్ జోన్‌గా మారింది. భద్రాద్రి ఏజెన్సీ నివురు గప్పిన నిప్పులా ఉంది. భద్రతా బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులు సంచళనాల కోసం దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం.. ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేయాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు ఇచ్చింది. ఇంకోవైపు 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీ లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా డెడ్ లైన్ పెట్టిన విషయం తెలిసిందే.


కాగా ములుగు జిల్లా ఏటూరు నాగారం అడవుల్లో మరోమారు తుపాకీ గర్జించింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) వారోత్సవాలకు ఒకరోజు ముందు మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. మృతుల్లో ఓ మహిళ సహా.. నర్సంపేట-ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి కుర్సం మంగు అలియాస్‌ భద్రు, ఏటూరునాగారం-మహాదేవ్‌పూర్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్‌ మధు ఉన్నారు. వీరిలో మధు స్వస్థలం పెద్దపల్లి జిల్లా రాణాపూర్‌ కాగా.. మిగతా ఆరుగురు ఛత్తీ్‌సగఢ్‌ వారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఛత్తీ్‌సగఢ్‌-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం అభయారణ్యాన్ని గ్రేహౌండ్స్‌, స్పెషల్‌పార్టీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో.. ఆదివారం ఉదయం 6.16 గంటల సమయంలో ఏటూరు నాగారం మండలం చెల్పాక-ఐలాపూర్‌ అభయారణ్యంలోని పోలకమ్మవాగు సమీపంలో నక్సల్స్‌ ఉన్నట్లు గుర్తించారు.

ఇరువైపులా అరగంట పాటు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల వైపు కాల్పులు ఆగిపోయిన కాసేపటికి.. పోలీసులు ఏడు మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో భద్రు, మధుతోపాటు.. ఏరియా కమిటీ సభ్యులు ముస్సాకి దేవల్‌ అలియాస్‌ కర్ణాకర్‌, ముస్సాకి జమునలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగతా ముగ్గురిని దళసభ్యులు జైసింగ్‌, కిశోర్‌, కామేశ్‌గా భావిస్తున్నారు. ఘటనాస్థలిలో రెండు ఏకే-47 తుపాకులు, జీత్రీ, 303-రైఫిల్‌, ఇన్సాస్‌ తుపాకీ, ఎస్‌బీబీఎల్‌ గన్‌, సింగిల్‌షాట్‌ తుపాకీ, తపంచా, కిట్‌బ్యాగులు, విప్లవ సాహిత్యం, వంట సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏటూరునాగారం, మంగపేట తహసీల్దార్‌లు శవపంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పలువురు మావోయిస్టులు తప్పించుకొని పారిపోయినట్లు భావిస్తున్న పోలీసులు.. కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ శబరీశ్‌ సంఘటనాస్థలాన్ని సందర్శించారు. ఎస్పీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగానే.. ఉదయం 11.47గంటలకు ఒకసారి, 11.49గంటలకు మరోసారి రెండేసి రౌండ్లు, మధ్యాహ్నం 12.14 గంటలకు మూడురౌండ్ల కాల్పులు జరిగాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కీలక భేటీ

అరకొర వసతులు అద్దె భవనాలు

మహేశ్‌బాబు ఎంజాయ్‌ చేశారు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 02 , 2024 | 08:22 AM