Share News

CM Revanth Reddy: రైతులను సీఎంబెదిరిస్తున్నారు..

ABN , Publish Date - May 23 , 2024 | 03:56 AM

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రైతులను బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. వరి వేస్తే ఉరే అని గతంలో కేసీఆర్‌ ప్రచారం చేయగా దొడ్డు బియ్యం సాగు చేస్తే గడ్డుకాలమే అనేలా ఇప్పుడు రేవంత్‌ చేస్తున్నారని విమర్శించారు. కల్లాల్లోకి పంట వచ్చిన వంద రోజుల్లోగా బోనస్‌ ఇస్తామన్న కాంగ్రెస్‌ ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు

CM Revanth Reddy: రైతులను సీఎంబెదిరిస్తున్నారు..

  • దొడ్డు రకం సాగైతే గడ్డుకాలమే అనేలా రేవంత్‌ తీరు

  • ప్రతి గింజా కొంటామని కేంద్రం చెబుతున్నా జాప్యమేల?

  • నెరవేర్చే సత్తా లేనప్పుడు హామీలు ఇవ్వడమెందుకు

  • రకంతో సంబంధం లేకుండా రైతులకు బోనస్‌ ఇవ్వాలి

  • జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సోనియాను ఏ ప్రాతిపదికన ఆహ్వానిస్తారు: కిషన్‌ రెడ్డి

  • ఓటేసిన అన్నదాతలకు చెయ్యిస్తారా

  • నెరవేర్చే సత్తా లేనప్పుడు హామీలెందుకు

  • రాష్ట్ర ప్రభుత్వంపై కిషన్‌ రెడ్డి ధ్వజం

హైదరాబాద్‌, మే22 (ఆంధ్రజ్యోతి):ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రైతులను బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. వరి వేస్తే ఉరే అని గతంలో కేసీఆర్‌ ప్రచారం చేయగా దొడ్డు బియ్యం సాగు చేస్తే గడ్డుకాలమే అనేలా ఇప్పుడు రేవంత్‌ చేస్తున్నారని విమర్శించారు. కల్లాల్లోకి పంట వచ్చిన వంద రోజుల్లోగా బోనస్‌ ఇస్తామన్న కాంగ్రెస్‌ ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దొడ్డు, సన్నరకాలు అని కాకుండా ప్రతి రైతుకు బోనస్‌ ఇవ్వాలని కోరారు .సన్న బియ్యం రైతులను ప్రొత్సహించాలనుకుంటే వారికి రూ.1000 బోనస్‌ ఇచ్చి, దొడ్డు బియ్యం రైతులకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం పండించే ప్రతీ రైతుకు బోనస్‌ ఇస్తామని రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి ఊరురా ప్రచారం చేశారని, ఇప్పుడు సన్నరకం సాగు చేసిన వారికే బోనస్‌ అని సన్నాయినొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసిన రైతులకు కాంగ్రెస్‌ అధికారం చేపట్టాక చెయ్యి ఇచ్చిందని ఎద్దేవా చేశారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లు రాష్ట్ర పాలకుల తీరు ఉందని ఎద్దేవా చేశారు. బాయిల్డ్‌ రైస్‌ విషయంలో బీఆర్‌ఎస్‌ నాయకులు గతంలో ఢిల్లీ వచ్చి లొల్లి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.


2023-24 ఖరీఫ్‌ సీజన్‌లో కేంద్రంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సరఫరా చేయడం లేదన్నారు. ఇప్పటికీ 22 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సరఫరా చేయాల్సి ఉందన్నారు. రబీ సీజన్‌కు సంబంధించి 75 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉందన్నారు. ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యం వల్ల రైతులు నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కొనుగోలు చేసిన ధాన్యం కేవలం 75 వేల టన్నులని, ఇదే తీరు కొనసాగితే ధాన్యం కొనుగోళ్ల పూర్తికి రెండు నెలలు కూడా చాలవని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ జాప్యం వల్ల ధాన్యం తడిచి రైతులు నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇక, ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రుణ మాఫీ చేయకపోవడంతో రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చిందని కిషన్‌ రెడ్డి అన్నారు. నెరవేర్చే సత్తా లేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారని కాంగ్రెస్‌ నేతలను కిషన్‌ రెడ్డి నిలదీశారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు త్వరలో తాను క్షేత్రస్థాయి పర్యటనకు వెళతానని కిషన్‌ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.


ఏ హోదాలో సోనియాను ఆహ్వానిస్తారు?

జూన్‌ 2న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి సోనియా గాంధీని ఏ హోదాలో ఆ ఆహ్వానిస్తున్నారని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమానికి రాజకీయ నాయకులను ఎలా ఆహ్వానిస్తారో సీఎం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒక వేళ జూన్‌ 2న నిర్వహించేది పార్టీ కార్యక్రమమైతే కేబినెట్‌లో ఎందుకు చర్చించారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని స్పష్టం చేశారు.

Updated Date - May 23 , 2024 | 03:56 AM