Share News

Kishan Reddy: మాఫీ గారడీ

ABN , Publish Date - Oct 08 , 2024 | 03:41 AM

కాంగ్రెస్‌ అంటేనే అబద్ధాల పుట్ట, అంకెల గారడీ అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రుణమాఫీపై సీఎం రేవంత్‌ రెడ్డి పొంతనలేని లెక్కలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.

Kishan Reddy: మాఫీ గారడీ

  • 31 వేల కోట్ల రుణమాఫీ చేశామని రేవంత్‌ అన్నారు

  • మోదీకి రాసిన లేఖలో రూ.17 వేల కోట్లే చెప్పారు..

  • మరి ఆ రూ.14 వేల కోట్లు ఏమయ్యాయి?

  • లెక్కలు బయట పెట్టాలి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ అంటేనే అబద్ధాల పుట్ట, అంకెల గారడీ అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రుణమాఫీపై సీఎం రేవంత్‌ రెడ్డి పొంతనలేని లెక్కలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. రూ.31 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని రేవంత్‌ ఒక సభలో ప్రకటించారని, ప్రధానికి రాసిన లేఖలో రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశామని పేర్కొన్నారని వెల్లడించారు. ఇందులో ఏది నిజమని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఒకవేళ రూ.17 వేల కోట్లే మాఫీ చేస్తే మిగిలిన రూ.14 వేల కోట్లు ఏమయ్యాయని నిలదీశారు. మరో 16 లక్షలకు పైగా రైతులకు ఎందుకు ఇంకా రుణమాఫీ జరగలేదని ప్రశ్నించారు.


అధికారంలోకి రాగానే ఒకేసారి రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని వరంగల్‌ రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్‌ ప్రకటించిందని, కానీ అధికారంలోకి వచ్చిన 224 రోజుల తర్వాత సగం మాత్రమే మాఫీ చేశారని విమర్శించారు. మొదట్లో రైతులందరికీ రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి, ఇప్పుడు కుటుంబంలో ఒకరికి మాత్రమే చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. అసలు తెలంగాణలో పంట రుణాలు తీసుకున్న రైతులు ఎంత మంది..? రుణమాఫీ జరిగింది ఎంతమందికి..? అనే లెక్కలన్నీ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ చెప్పిన దాంట్లో మూడోవంతు మందికి కూడా రుణమాఫీ జరగలేదని అన్నారు. రుణమాఫీ విషయంలో రైతుల్లో అయోమయం తొలగిపోవాలంటే, లెక్కలన్నీ బహిర్గతం చేయాలని కిషన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 08 , 2024 | 03:41 AM