Share News

Kishan Reddy : పేదల సొంతింటి కలను సాకారం చేద్దాం

ABN , Publish Date - Aug 14 , 2024 | 05:38 AM

తెలంగాణలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సొంతిల్లు అవసరం ఉన్న పేద కుటుంబాల జాబితాను వీలైనంత త్వరగా తయారుచేసి కేంద్రానికి పంపించాలని సూచించారు.

Kishan Reddy : పేదల సొంతింటి కలను సాకారం చేద్దాం

  • గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకోసం అర్హులైన.. పేదల జాబితాను కేంద్రానికి పంపండి

  • సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ

  • 2018 సర్వేలో నాటి ప్రభుత్వం భాగస్వామి కాలేదు

  • పేదలకు కేంద్ర సాయం అందకుండా చేశారు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సొంతిల్లు అవసరం ఉన్న పేద కుటుంబాల జాబితాను వీలైనంత త్వరగా తయారుచేసి కేంద్రానికి పంపించాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికీ సొంతింటిని నిర్మించాలనే సంకల్పంతో 2016లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారని గుర్తుచేశారు.

ఈ పథకం కింద దేశవ్యాప్తంగా సొంతిల్లు లేని కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2024 మార్చి నాటికి 2.95 కోట్ల పక్కా ఇళ్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. మొదటి విడత గడువు ముగిసినా.. ఈ పథకాన్ని కొనసాగిస్తూ రెండో విడతలో భాగంగా 2024 నుంచి 2029 మధ్యకాలంలో మరో 2కోట్ల ఇళ్లు ఇవ్వాలని ఈ నెల 9న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామని పేర్కొన్నారు.

2018లో ఇల్లు అవసరం ఉన్నవారి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో పలు రాష్ట్రాలు పాల్గొని జాబితాలు అందజేశాయని, అందులో ఇళ్లు మంజూరు కానివారితోపాటు 2011లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కులగణన జాబితాలో.. ఇంతవరకూ ఇళ్లు మంజూరు కానివారికి తొలి పాధాన్యం ఇస్తామని తెలిపారు. ఈ రెండు జాబితాలు పూర్తయిన అనంతరం.. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సొంతిల్లు అవసరం ఉన్నవారికోసం ప్రత్యేకంగా సర్వే నిర్వహించి వారికి కూడా ఇళ్లను మంజూరు చేస్తామని వివరించారు.


పేదలకు అన్యాయం చేసిన కేసీఆర్‌..

దేశంలోని అనేక రాష్ట్రాలు తమకు ఇళ్లు కావాలని కేంద్ర ప్రభుత్వానికి జాబితాను అందించాయని కిషన్‌రెడ్డి తెలిపారు. కానీ, తెలంగాణలో సొంతింటి అవసరం ఉన్న పేద కుటుంబాలు లక్షలాదిగా ఉన్నప్పటికీ.. 2018 సర్వేలో గత ప్రభుత్వం భాగం కాలేదని పేర్కొన్నారు.

దాంతో ఇళ్ల కోసం ఎటువంటి జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపలేదన్నారు. ‘‘2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న కేసీఆర్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో పేద ప్రజలకు ఆశ చూపించి మభ్యపెట్టిందితప్ప.. ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయలేదని అన్నారు.

తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సాయం అందకుండా అన్యాయం చేసింది’’ అని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు గ్రామీణాభివృద్థి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రతిపాదనలు వస్తే ఇళ్లను కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని వారు చెప్పినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల కోసం నిర్వహించనున్న సర్వేలో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - Aug 14 , 2024 | 07:00 AM