Kishan Reddy: పేదల ఇళ్ల జోలికొస్తే సర్కారు కూలుతుంది..
ABN , Publish Date - Oct 04 , 2024 | 03:37 AM
పేదవాడి ఇంటిపై గడ్డపార వేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోక తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు.
డ్రైనేజీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం చూపండి
అది లేకుండా మూసీ సుందరీకరణా?
బుల్డోజర్లు దింపితే బీజేపీ చూస్తూ ఊరుకోదు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
మీడియా బహిష్కరించాలని పిలుపు
హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): పేదవాడి ఇంటిపై గడ్డపార వేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోక తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇళ్లపై బుల్డోజర్లు దింపితే బీజేపీ చూస్తూ ఊరుకోదని ప్రకటించారు. పేదలపై ప్రతాపం చూపిస్తే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో తమ సర్కారే వస్తుందంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్.. ఇప్పుడు ఎక్కడకు వెళ్లారని నిలదీశారు. వేలాది ఇళ్ల కూల్చివేతపై ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ సుందరకీరణ పేరిట చేపట్టిన అనాలోచిత చర్యలను అడుగడుగునా అడ్డుకుంటామని, పేదలకు అండగా తమ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్‌లోని 70శాతం డ్రైనేజీ నీరు మూసీలో చేరుతోందని, ఆ సమస్యను పరిష్కరించకుండా మూసీ సుందరీకరణ చేపట్టి ఏం ప్రయోజనమని నిలదీశారు. ‘‘హైడ్రా అంటే రేవంత్.. రేవంత్ అంటేనే హైడ్రా. ఆయన ఆలోచనల నుంచి వచ్చిన ఒక సంస్థ హైడ్రా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక అధికారి మాత్రమే. అనేక చెరువుల్లో బడా బాబులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, వ్యాపారవేత్తల ఫాంహౌ్‌సలు ఉన్నాయి. ముందు వాటిపై హైడ్రా ప్రతాపం చూపాలి.
దమ్ముంటే అక్రమంగా నిర్మించిన ఒవైసీ ఫాతిమా కాలేజీని కూల్చండి. ఫాతిమా కాలేజీ కూల్చివేత వాయిదాకు విద్యాసంవత్సరాన్ని హైడ్రా కారణంగా చెబుతోంది. ఇప్పుడు పేదల ఇళ్లలో విద్యార్థుల్లేరా? ఎక్కడెక్కడో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లకు వారిని తరలిస్తే వారి చదువేం కావాలి? ఎందుకీ ద్వంద్వ నీతి?’’ అని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేతులెల్తేసిన కాంగ్రెస్.. ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో రాష్ట్రంలో ఆర్‌జీ ట్యాక్స్, ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరిట దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.
వారిని మీడియా బహిష్కరించాలి
కుటుంబాలు, మహిళల గురించి ఇష్టానుసారం మాట్లాడడం కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సకు అలవాటైపోయిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. మర్యాదపూర్వకంగా మాట్లాడని రాజకీయ నాయకులను మీడియా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి భాషను కేసీఆర్ మొదలు పెడితే కేటీఆర్ దానిని కొనసాగించారని, ఇప్పుడు రేవంత్ అదే భాష మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అడ్డంగా మాట్లాడే వాళ్లే హీరోలని, వారే నిజమైన నాయకులని ఈలలు కొట్టినన్ని రోజులూ ఇలాంటి చెడు సంస్కృతి కొనసాగుతూనే ఉంటుందన్నారు. కుటుంబ వ్యవహారాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు.